కలం, నారాయణపేట: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నారాయణపేట (Narayanpet) అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్నారు. ఇండియా కూటమి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మంగళవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని నర్సిరెడ్డి చౌరస్తాలో “ఓటు హక్కు పరిరక్షణ కోసం పోరాడుదాం” అంటూ కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ పార్టీల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. SIR ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్ల హక్కులకు ఎలాంటి నష్టం కలగకుండా ఎన్నికల సంఘం పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
ప్రజల్లో ఉన్న అనుమానాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయాలని కోరారు. దశాబ్దాలుగా ఓటు హక్కును వినియోగించుకుంటున్న పౌరులను పాత రికార్డులు, పూర్వీకుల వివరాల పేరుతో ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. నోటీసులు జారీ చేసిన ప్రతి ఓటరుకు తన వాదనను వినిపించే అవకాశం కల్పించాలని కోరారు. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించే ముందు కారణాలను స్పష్టంగా తెలియజేయాలని, ఫారం-6,ఫారం-7 ప్రక్రియలను నిబంధనల ప్రకారం, పూర్తి పారదర్శకతతో నిర్వహించాలన్నారు. ఓటు హక్కు కేవలం ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం మాత్రమే కాదని, అది ప్రజాస్వామ్యంలో పౌరుడి గొంతుక అని పేర్కొన్నారు.
ప్రజల ఓటు హక్కును పరిరక్షించేందుకు ఇండియా కూటమి ఐక్యంగా పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం నిలవాలంటే ఎన్నికల సంఘం ప్రతి చర్యలో పారదర్శకత పాటించాల్సిందేనన్నారు. అనంతరం ఇండియా కూటమి నాయకులు, కార్యకర్తలు నర్సిరెడ్డి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ మీదుగా జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో “ఓటు బచావో.. దేశ్ బచావో”, “ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి” అంటూ నినాదాలు చేశారు.
అనంతరం కలెక్టరేట్‌కు చేరుకున్న కూటమి ప్రతినిధులు కలెక్టరేట్ ఏవో అనిల్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. సదాశివ రెడ్డి, బండి వేణుగోపాల్, సలీం, వెంకటయ్య, మనోహర్ గౌడ్, కౌన్సిలర్ శ్వేత వెంకటేష్ గౌడ్, బండి రాజేశ్వరీ, నర్సింహా, వెంకట్రాంరెడ్డి, హన్మేష్ చారి, బి. రాము, కాశినాథ్, గోపాల్ ఇండియా కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

