కలం, నిజామాబాద్ బ్యూరో: దేశంలో ఓట్ల తొలగింపు, ఎస్ఐఆర్ ప్రక్రియలో జరిగిన అక్రమాలపై ప్రశ్నిస్తే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి నాయకులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విధానాలకు గొడ్డలిపెట్టులాంటిదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు. ఈ విషయంపై ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
ఇండియా కూటమి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఎన్నికల సంఘం (ఈసీ) ముందు దీక్ష చేసేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమని అన్నారు. ఇండియా కూటమి నాయకులు దేశంలోని ఒక ప్రధాన సమస్యపై పోరాటం చేస్తుంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం అడ్డుకోవడం నియంతృత్వ పాలనకు పరాకాష్ట అని విమర్శించారు.దేశంలోని ఇండియా కూటమి ఎంపీలు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్న కార్యక్రమం విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ చర్యను ప్రతి ప్రజాస్వామ్యవాది ఖండించాలని కోరారు. దేశంలో అడ్డగోలుగా ఓట్ల చోరీ చేసి అక్రమంగా అధికారంలోకి వస్తున్న బీజేపీ.. ఇండియా కూటమి నేతలను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

