Mobile Popup Ad
Mobile Popup Ad

‘గుంపు మేస్త్రీ హఠావో.. తెలంగాణ బచావో’: కవిత సంచలన నినాదం!

కలం, వెబ్‌ డెస్క్‌ : హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద సెంట్రింగ్ కార్మికులు చేపట్టిన ధర్నాకు తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కార్మికుల నిరసనలో పాల్గొన్న ఆమె, ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సాయంత్రం లోపు సెంట్రింగ్ కార్మికులను ప్రభుత్వం చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే కార్మికులతో పాటు తానే స్వయంగా ధర్నాలో కూర్చుంటానని హెచ్చరించారు. హైదరాబాద్ మహానగరంలో అద్దాల మేడలు కనిపిస్తున్నాయంటే దాని వెనుక సెంట్రింగ్ కార్మికుల (Centering Workers) కృషి ఎంతో ఉందని కవిత కొనియాడారు. తాళ్లు కట్టుకొని, ప్రాణాలు పణంగా పెట్టి గాలిలో వేలాడుతూ పనిచేసే కార్మికులకు బిల్డింగ్ నిర్మాణ అగ్రిమెంట్‌లో ఎందుకు చోటు కల్పించడం లేదని ప్రశ్నించారు. రెండు లక్షల రూపాయల పని కోసం వెళ్తూ, తమతో పాటు 15 లక్షల రూపాయల మెటీరియల్‌ను తీసుకెళ్తున్న కార్మికుల సామాగ్రికి కనీస రక్షణ లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

గుంపు మేస్త్రీ వచ్చాక అన్ని వర్గాలు ఆగం..

రాష్ట్రంలో గుంపు మేస్త్రీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు ఆగమవుతున్నారని కవిత (Kavitha) విమర్శించారు. అందుకే తాను ‘గుంపు మేస్త్రీ హఠావో.. తెలంగాణ బచావో’ అని పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా ఇళ్లను కూల్చివేస్తున్నారని, ఈ ప్రక్రియలో సెంట్రింగ్ కార్మికులు తమ విలువైన మెటీరియల్‌ను నష్టపోతున్నారని ఆరోపించారు. ఈ నష్టానికి ఇంటి యాజమాని గానీ, ప్రభుత్వం గానీ ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదన్నారు. గత పది రోజులుగా 86 చోట్ల సెంట్రింగ్ కార్మికులు, కాంట్రాక్టర్లు పనులను బంద్ చేసినప్పటికీ, తమ వద్ద ఉన్న కూలీలను మానవత్వంతో సాకుతున్నారని కవిత (Kavitha) అభినందించారు. కార్మికులు చూపిస్తున్న ఈ మానవత్వాన్ని ప్రభుత్వం కూడా చూపించాలన్నారు. కార్మికులు కోరుతున్న 12 అంశాల డిమాండ్లు చాలా చిన్నవని, అవి గొంతెమ్మ కోరికలు కావని స్పష్టం చేశారు. ఈఎస్ఐ కార్డులు ఇవ్వడం, స్క్వేర్ మీటర్‌కు 51 రూపాయలు చెల్లించడం, కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను 10 లక్షల నుండి 20 లక్షల రూపాయలకు పెంచడం వంటి సహేతుకమైన డిమాండ్లకే తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం మేస్త్రీలు స్క్వేర్ ఫీట్‌కు 4 వందల రూపాయలు అడుగుతున్నారని, అందులో సెంట్రింగ్ కార్మికుల వాటా ఎంతో స్పష్టం చేయాలని కవిత డిమాండ్ చేశారు. మేస్త్రీల చేతిలో కార్మికుల జుట్టు ఉండకూడదని హితవు పలికారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికుల అన్ని డిమాండ్లను తీరుస్తామని హామీ ఇచ్చారు. 186 చోట్ల వెయ్యి నుండి రెండు వేల గజాల స్థలాన్ని కేటాయిస్తామని, ప్రతి మండలంలో సెంట్రింగ్ కార్మికుల సంఘాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

హైదరాబాద్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల అడుగులో అడుగు వేస్తానని కవిత భరోసా ఇచ్చారు. కార్మికుల సమస్యలు తీరే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. సెంట్రింగ్ కార్మికుల డిమాండ్లను ఇప్పటికైనా పట్టించుకోకపోతే, వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమని కవిత హెచ్చరించారు.

Read Also: ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే: జగదీశ్ రెడ్డి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>