Mobile Popup Ad
Mobile Popup Ad

దేవస్థానమా? రాజకీయ పార్టీ ఆఫీసా?.. యాదగిరిగుట్టలో ఫ్లెక్సీల కలకలం

కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి పవిత్ర క్షేత్రం రాజకీయ ప్రచార వేదికగా మారిందా? ఆలయ నిబంధనలను స్వయంగా అధికారులే గాలికొదిలేశారా? అంటే అవుననే అంటున్నాయి అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం యాదగిరిగుట్ట (Yadagirigutta)లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన తరుణంలో… రాయగిరి నుంచి యాదగిరిగుట్ట కొండపై వరకు నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన రాజకీయ ఫ్లెక్సీలు (Political Flexi Banners), బ్యానర్లు భక్తులను, స్థానికులను తీవ్ర విస్మయానికి గురిచేస్తున్నాయి. ఆలయాల పవిత్రతను కాపాడటానికి, ఎలాంటి రాజకీయ ప్రచారాలకు తావు లేకుండా ఉండేందుకు దేవస్థాన పరిధిలో రాజకీయ ఫ్లెక్సీలు, పోస్టర్లు లేదా బ్యానర్లు పెట్టడం పూర్తిగా నిషేధమని యాదగిరిగుట్ట దేవస్థాన అధికారులు గతంలోనే స్పష్టమైన నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు.

ఆలయాల వద్ద రాజకీయ ప్రదర్శనలు చేయడం, రీల్స్ చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని పలుమార్లు హెచ్చరించారు. కానీ, శనివారం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆ నిబంధనలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి పాదాల చెంత, కొండ చుట్టూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఫొటోలతో కూడిన భారీ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. చివరకు పవిత్ర రాజగోపురాలు, ప్రాకారాలు, మండపాలను కూడా వదలకుండా ఈ బ్యానర్లు కట్టడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇది స్వామివారి దేవస్థానమా లేక రాజకీయ పార్టీ కార్యాలయమా?” అంటూ స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఆలయ అధికారులు, భద్రతా సిబ్బంది కళ్ళుండి చూడలేకపోతున్నారా? లేక అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి మౌనంగా ఉండిపోయారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

చట్టం ఏం చెబుతోంది?

దేవస్థానాల పరిసరాల్లో లేదా ఆలయ గోడలపై అనధికారికంగా, నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరం. దేవస్థానం ఈవో, ట్రస్ట్ బోర్డు నుండి ముందస్తు లిఖితపూర్వక అనుమతి లేకుండా ఆలయ స్థలంలో ఎలాంటి ప్రకటనలు, స్వాగత బోర్డులు ఏర్పాటు చేయరాదు. నిబంధనలు ఉల్లంఘించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను దేవస్థానం సిబ్బంది లేదా టాస్క్ ఫోర్స్ తక్షణమే తొలగించాలి. అనధికారికంగా ఫ్లెక్సీలు వేసిన వారిపై, ముద్రించిన వారిపై దేవాదాయ శాఖ చట్టాల ప్రకారం జరిమానాలు విధించే అవకాశం ఉంది.

బహిరంగ ప్రదేశాలను, ప్రభుత్వ ఆస్తులను విరూపణ (ధ్వంసం) చేసినందుకు గాను ‘ప్రభుత్వ ఆస్తుల విరూపణ (ధ్వంసం) చట్టం’ కింద పోలీసు కేసులు కూడా నమోదు చేయవచ్చు. ఇదిలా ఉంటే.. పాలకులెవరైనా దేవుడి ముందు సామాన్యులేనని, రాజకీయ ప్రచారాల కోసం యాదగిరిగుట్ట (Yadagirigutta) పవిత్రతను దెబ్బతీయడం సరికాదని భక్తులు హితవు పలుకుతున్నారు. తక్షణమే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాజకీయ ఫ్లెక్సీలను కొండపై నుండి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: ఫ్యూచర్‌ సిటీ రద్దు చేసే శక్తి వారికి లేదు : టీపీసీసీ చీఫ్‌

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>