Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యాభివృద్ధికి ‘ఏలేటి’ సోదరుల గొప్ప చేయూత.. భారీ విరాళం!

కలం, నిర్మల్ : విద్యారంగ అభివృద్ధికి చిరస్మరణీయమైన నిర్ణయంగా నిర్మల్ (Nirmal)  జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ నూతన పాఠశాల భవన నిర్మాణం కోసం రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది ఏలేటి నిరంజన్ రెడ్డి, ఆయన పెద్దన్నయ్య ఏలేటి వెంకట రమణ రెడ్డి (Alleti Brothers) నాలుగు ఎకరాల భూమిని భూదానంగా అందించడం విశేషంగా నిలిచింది. విద్యాభివృద్ధి పట్ల వారి నిబద్ధతకు నిదర్శనంగా నిలిచిన ఈ నిర్ణయం జిల్లాలో ప్రశంసలు అందుకుంటోంది.

1967లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి శిశు మందిర్‌గా గుర్తింపు పొందిన ఈ విద్యాసంస్థ ఇటీవల మళ్లీ పునఃప్రారంభమైంది. పాఠశాలను విస్తరించి, ఆధునిక వసతులతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థి నిరంజన్ రెడ్డిని సంప్రదించగా, ఆయన వెంటనే తన సోదరుడు వెంకట రమణ రెడ్డితో చర్చించి దిలావర్‌పూర్ మండలం సిర్గాపూర్ గ్రామ శివారులోని నాలుగు ఎకరాల భూమిని (సుమారు 3 కోట్ల) విరాళంగా అందించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన భూ పత్రాలను మంగళవారం పాఠశాల అభివృద్ధి కమిటీకి అందజేశారు.

ఈ భూదానం ద్వారా భవిష్యత్తులో విశాలమైన పాఠశాల భవనం, ఆధునిక తరగతి గదులు, గ్రంథాలయం, క్రీడా మైదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక, విద్యార్థులకు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే అవకాశాలు మెరుగుపడనున్నాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఈ విరాళం కీలకంగా మారనుంది. విద్యకు చేసిన పెట్టుబడి సమాజ భవిష్యత్తుకు చేసిన పెట్టుబడేననే సందేశాన్ని ఈ భూదానం ప్రతిబింబిస్తోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. నిరంజన్ రెడ్డి, వెంకట రమణ రెడ్డి చేసిన ఈ ఉదార దానం నిర్మల్ జిల్లాలో విద్యాభివృద్ధికి కొత్త దిశను చూపడమే కాకుండా, సమాజం పట్ల బాధ్యతను చాటిచెప్పే ఆదర్శంగా నిలుస్తుందని పలువురు కొనియాడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>