కలం, నిర్మల్: నిర్మల్ మండలం డ్యాంగాపూర్ (Dyangapur) గ్రామంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నిర్మల్ డివిజన్‌లోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వసతి గృహ సంరక్షణ అధికారుల సమావేశం శనివారం నిర్వహించారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నిహారిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల, వసతి గృహం, డైనింగ్ హాల్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.. సిబ్బంది హాజరు నమోదు కచ్చితంగా పాటించాలని, యూనిఫైడ్ హాస్టల్ మానిటరింగ్ సిస్టంలో విద్యార్థుల నమోదు వంద శాతం పూర్తి చేయాలని సూచించారు.
యూడైస్ పోర్టల్‌లో విద్యార్థుల వివరాలను సరిచేయాలని, అక్టోబర్ 1 నుంచి జరిగే ఎస్ఏ 1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నిహారిక నిహారిక ఆదేశించారు. ప్రతి నెల చివరి వారంలో తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని తెలియజేయాలని, స్టడీ అవర్స్‌ను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏసీఎంఓ రాథోడ్ శివాజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనూష, జిల్లా క్రీడల అధికారి భూక్య రమేష్ పాల్గొన్నారు.

