ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ కావాలా? వెంటనే దరఖాస్తు చేసుకోండి!

కలం, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్రంలోని నగర ప్రాంతాల్లో నివసిస్తున్న అర్హులైన నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ (Indiramma Towers) నిర్మాణం చేపట్టి, అందుబాటు ధరల్లో ఫ్లాట్ల కేటాయింపు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రంలోని నిజామాబాద్ సహా గ్రేటర్ వరంగల్, హనుమకొండ, నల్గొండ, మహబూబ్ నగర్ మొత్తం ఐదు పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలు జరిపి, అర్హులైన వారికి ఫ్లాట్లు కేటాయించాలని నిర్ణయించిందని అన్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ నాగారం ప్రాంతంలో గల ఆర్‌జీకే కాలనీలో ఇందిరమ్మ టవర్ నిర్మాణం జరిపి 480 ఫ్లాట్ల కేటాయింపు కోసం అర్హులైన వారి నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతోందన్నారు.

ఫ్లాట్ విస్తీర్ణం, ధర, ప్రభుత్వ రాయితీ వివరాలు

ప్రతి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ విస్తీర్ణం 512 చదరపు అడుగులుగా నిర్ణయించారని, ఒక్కో ఫ్లాట్‌పై ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందించనుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. ఫ్లాట్ల నిర్మాణానికి అవసరమైన స్థలం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. ప్రభుత్వ సబ్సిడీ మినహాయించి, ఒక్కో ఫ్లాట్‌కు లబ్ధిదారుడు తన వాటా రూపంలో రూ.3.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తాత్కాలికంగా నిర్ణయించారని తెలిపారు.

దరఖాస్తు రుసుము, ఈఎండీ వివరాలు

ఒక్కో దరఖాస్తుకు రూ.100 (తిరిగి చెల్లించబడదు) రుసుము ఉంటుందని, ఈఎండీ / టోకెన్ అడ్వాన్స్ కింద రూ.10,000 చెల్లించాలని అన్నారు. ఫ్లాట్ కేటాయింపు జరగని వారికి ఈఎండీ తిరిగి వాపసు చేస్తారని తెలిపారు. ఫ్లాట్ కేటాయింపు జరిగిన వారికి ఈ మొత్తాన్ని లబ్ధిదారుడి వాటాలో సర్దుబాటు చేస్తారని అన్నారు.

అర్హత నిబంధనలు

దరఖాస్తు చేసుకునే వారికి సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా సొంత ఇల్లు లేదా ప్లాట్ ఉండకూడదని తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదని, ఫ్లాట్‌ను 10 సంవత్సరాల పాటు విక్రయించడం లేదా అద్దెకు ఇవ్వడం అనుమతించబడదని కలెక్టర్ స్పష్టం చేశారు. అయితే బ్యాంకు మార్ట్ గేజ్‌కు అనుమతి ఉంటుందని సూచించారు. ఒక కుటుంబం నుంచి ఒకే దరఖాస్తు, ఒకే ఫ్లాట్‌కు మాత్రమే అవకాశం కల్పిస్తారని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివసించే వారు మాత్రమే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులను కలెక్టర్ పేర్కొన్నారు.

చెల్లింపుల విధానం

ఫ్లాట్ కోసం ఎంపిక అయిన లబ్ధిదారులు తమ వాటా మొత్తాన్ని విడతల వారీగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. తాత్కాలిక కేటాయింపు సమయంలో రూ.1 లక్ష, ఆర్‌సీసీ నిర్మాణం పూర్తయినప్పుడు రూ.1 లక్ష,, ఫినిషింగ్ దశలో రూ.1 లక్ష, నిర్మాణం పూర్తయి ఫ్లాట్ అప్పగించే సమయంలో – మిగిలిన మొత్తం వాటాను చెల్లించాలని అన్నారు.

ఎంపిక ప్రక్రియ

అర్హులైన దరఖాస్తుదారులను గుర్తించేందుకు ముందుగా ఐడీ వెరిఫికేషన్ నిర్వహిస్తారని, అనంతరం లాటరీ విధానం ద్వారా ఫ్లాట్లు కేటాయించి, ఎంపికైన లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని కలెక్టర్ వివరించారు.

దరఖాస్తు విధానం, చివరి తేదీ

అర్హులైన అభ్యర్థులు సంబంధిత మీ సేవా కేంద్రాల ద్వారా లేదా అధికారిక మీ సేవా వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తుల స్వీకరణకు డిసెంబర్ 5 చివరి తేదీ అని తెలిపారు. మరిన్ని వివరాల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 040-24603572 ను సంప్రదించవచ్చని సూచించారు. అర్హులైన నిజామాబాద్ నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>