3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం: ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సదస్సు

కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్–2026’ (Telangana Global Summit)కు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ సదస్సు జరగనున్నది. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ నిర్వాహకులు ముందుగానే ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని పరిశ్రమలు, వాణిజ్య శాఖ సూచించింది.

భారీ ఏర్పాట్లు.. స్కోర్‌కార్డ్ రిలీజ్

2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో 2025తో పోలిస్తే సదస్సును మరింత భారీగా నిర్వహిస్తున్నారు. 72,250 చదరపు మీటర్ల ప్రాంగణంలో 6 భారీ హ్యాంగర్లు, 4 ప్రత్యేక హాళ్లలో 52 రంగాల వారి సమావేశాలు నిర్వహిస్తారు. ‘ప్లెడ్జ్, ప్లాట్, ప్లాంట్, పేరోల్, ప్రొడక్ట్’ అనే 5 దశల ఆధారంగా కార్యక్రమాలు ఉంటాయి. డిసెంబర్ 9న జరిగే ముగింపు సమావేశంలో ‘ప్లెడ్జ్ టు ప్రొడక్ట్ స్కోర్‌కార్డ్’ విడుదల చేసి, పెట్టుబడుల హామీల అమలు పురోగతిని వెల్లడిస్తారు.

9 ప్రత్యేక పెవిలియన్లు

సదస్సు(Telangana Global Summit)లో 9 ప్రధాన ఈవెంట్లు, పెవిలియన్లు ఏర్పాటు చేస్తున్నారు. ‘రక్షా ఎక్స్‌పో’ డిసెంబర్ 7 నుంచి 9 వరకు వ్యాపార కార్యకలాపాలకు, 10 నుంచి 13 వరకు ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంటుంది. డీఆర్‌డీఓ, హెచ్‌ఏఎల్, బీఈఎల్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎల్‌అండ్‌టీ, స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థలు పాల్గొంటాయి. ప్రారంభోత్సవం రోజు ప్రత్యేక ఏరోబాటిక్ ఎయిర్‌షో నిర్వహిస్తారు. స్టార్టప్‌ల పెవిలియన్‌లో రక్షణ, ఏరోస్పేస్ (35), హెల్త్, ఫార్మా (30) సహా 136 స్టార్టప్‌లు పాల్గొంటాయి.

ఫార్మా ఎక్స్‌పోలో 60 కంపెనీలు, అగ్రి పెవిలియన్‌లో 45 సంస్థలు, ఎడ్యుకేషన్ ఎక్స్‌పోలో 47 సంస్థలు భాగస్వామ్యం కానున్నాయి. చేనేత, బతుకమ్మ, కాకతీయ శిల్పకళతో తెలంగాణ పెవిలియన్, మహిళల కోసం ‘శక్తి పెవిలియన్’, డిసెంబర్ 7 నుంచి 13 వరకు ‘ఇండియాజాయ్–2026’ నిర్వహిస్తారు. ఎల్‌ నినో ప్రభావంపై డిసెంబర్ 8న 200 మంది నిపుణులతో ‘తెలంగాణ క్లైమేట్ కాన్‌క్లేవ్’ జరుగుతుంది. ప్రభుత్వ శాఖల సమస్యలకు పరిష్కారాలు చూపే ‘తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్’ కోసం tisc.telangana.gov.inలో నవంబర్ 20లోగా దరఖాస్తు చేసుకోవాలి.

దిగ్గజాల భాగస్వామ్యం

25కి పైగా రంగాలకు చెందిన అనీష్ షా, సంజీవ్ పూరి, కృతివాసన్, విశాల్ ధూపర్, సంగీతా రెడ్డి, సతీష్ రెడ్డి సహా 200 మంది పారిశ్రామికవేత్తలతో అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారు. 2025 సమిట్‌లో 69 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రకటనలు రాగా, ఈసారి అంతకంటే ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించేలా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, గడ్డం వివేక్‌తో కూడిన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నది.

Also Read : వ్యవస్థను కలుషితం చేసే వారిని ప్రశ్నించాలి.. కాలుష్యంపై విమర్శలకు యోగి కౌంటర్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>