కలం, ఖమ్మం బ్యూరో: గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూముల జోలికి వస్తే సహించేది లేదని ప్రగతి శీల వ్యవసాయ కార్మిక సంఘం (సీపీఐ ఎంఎల్ మాస్ లైన్) భద్రాచలం డివిజన్ కార్యదర్శి సాయన్న హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా దుమ్ముగూడెం మండల కేంద్రంలో గిరిజన రైతులతో కలిసి సోమవారం భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. గౌరారం గ్రామంలో పోడు రైతుల సమస్యను వెంటనే పరిష్కరించాలని, అలాగే మండలంలో బెల్ట్ షాపులను తక్షణమే అరికట్టాలంటూ నినాదాలు చేశారు. ఏపీజీబీ బ్యాంకు సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ ఆఫీస్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ.. ఎన్ని ప్రభుత్వాలు మారినా గౌరారం గిరిజన పోడు రైతులకు ఫారెస్ట్ అధికారుల నుంచి తిప్పలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం భూమి సాగులో ఉన్నా, ఆర్ఓఎఫ్‌ఆర్ పట్టాలు పొందినా అధికారులు బెదిరింపులు, దౌర్జన్యాలు ఆపడం లేదని మండిపడ్డారు.
కలెక్టర్, ఐటీడీఏ పీవో చెప్పినా..
గతంలో జిల్లా కలెక్టర్, భద్రాచలం ఐటీడీఏ పీఓ స్వయంగా పోడు భూములు పరిశీలించి, రెండు పంటలు వచ్చే మునగ సాగు చేసుకోమని సూచించారని సాయన్న గుర్తు చేశారు. అయినా ఫారెస్ట్ అధికారులు రైతులపై దాడులు చేస్తూ.. వంద మందికి పైగా సాగుదారులపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత సీజన్‌లో పత్తి సాగుకు సిద్ధమవుతున్న రైతులను అడ్డుకోవద్దని, గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో వినతి పత్రాలు సమర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం నాయకులు మడకం సమ్మక్క, శీలం లక్ష్మీదేవి, గంగమ్మ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో పోడు రైతులు పాల్గొన్నారు.

