కలం, ఖమ్మం బ్యూరో: సింగరేణి (Singareni) కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. లేకపోతే ఈ నెల 22వ తేదీ తర్వాత ఎప్పుడైనా సమ్మెకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. సోమవారం పీవీకే-5 గనిలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య మాట్లాడారు. కార్మికుల సహనాన్ని యాజమాన్యం బలహీనతగా భావించవద్దని అన్నారు. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న మెడికల్ బోర్డు కేసులు, అలియాస్ పేర్ల మార్పులు, పెర్క్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్ తొలగింపు, సొంత ఇంటి స్థలాల కేటాయింపు, డిపెండెంట్ ఉద్యోగాలు వంటి సమస్యల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. మెడికల్ ఫిట్ అయిన డిపెండెంట్లకు నియామక ఉత్తర్వులు జారీ తమ పోరాట ఫలితమేనన్నారు.
బకాయిలు చెల్లించాల్సిందే..
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన సుమారు రూ.56 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రంగయ్య డిమాండ్ చేశారు. కొత్త కోల్ బ్లాకుల కేటాయింపు, కొత్త గనుల ప్రారంభం, సంస్థ విస్తరణతో పాటు భవిష్యత్ తరాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే చర్యలు చేపట్టాలని కోరారు. గతంలో యూనియన్‌తో జరిగిన సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్లు అమలు కాకపోవడానికి రాజకీయ జోక్యమే ప్రధాన కారణమని ఆరోపించారు. కార్మికుల సమస్యలపై యాజమాన్యం తన మొండివైఖరిని వీడకపోతే సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉద్ధృతమవుతాయని, అవసరమైతే నిరవధిక సమ్మెకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి వి. మల్లికార్జున్ రావు, కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, యూనియన్ నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

