కలం, వెబ్ డెస్క్: మైసూర్ (Mysuru) సిటీలోని దత్తగల్లిలో సోమవారం ఓ రెస్టారెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వంటమనుషులు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ‘మారా’ రెస్టారెంట్ రెండో అంతస్తులో అలంకరణ కోసం ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్లలో షార్ట్ సర్క్యూట్ సంభవించడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మరణించిన వారిని పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌కు చెందిన సాహిల్, నేపాల్‌కు చెందిన ప్రకాశ్‌గా గుర్తించారు. గాయపడిన వారిలో రెస్టారెంట్ యజమానితో పాటు మేనేజర్ కూడా ఉన్నారు.
సోమవారం సాయంత్రం సిబ్బంది వంటగదిలో ఏర్పాట్లు చేసుకుంటుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా వ్యాపించిన మంటలు క్షణాల్లో వంటగదిని చుట్టుముట్టడంతో, లోపల ఉన్నవారు ప్రాణాలు రక్షించుకోవడానికి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

