కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో బీజేపీ మతం పేరిట ప్రజల్ని రెచ్చగొడుతోందని టీపీసీసీ చీఫ్ (TPCC Chief) మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ (Nizamabad)లో పట్టణంలోని సన్ ఫ్లవర్ హైస్కూల్‌లో మహేశ్ కుమార్ గౌడ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నానని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రతి చోటా ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలింగ్ శాతం పెరిగితే మంచి నాయకులు ఎన్నికవుతారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారని మహేశ్ కుమార్ తెలిపారు. బీజేపీ మతంపేరిట ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని, ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారని, కానీ రాష్ట్ర ప్రజలు తెలివైన వారని చెప్పారు. 90 శాతం మున్సిపల్ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలు విజ్ఞత గల వారని, పట్టణంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు.


