epaper
Tuesday, November 18, 2025
epaper

చేవెళ్ల ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల(Chevella) మండలం మీర్జాగూడ (ఖానాపూర్ స్టేజ్‌) సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును కంకర లోడ్‌తో ఉన్న టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు 19 మంది మృతి చెందినట్టు అధికారులు నిర్ధారించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చనిపోయిన వారిలో పది మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. 19 మందిలో 13 మృతదేహాలను పోలీసులు ఇప్పటివరకు గుర్తించారు. తాండూరు డిపోకు చెందిన టీజీఆర్‌టి‌సీ బస్ తాండూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ప్రధాన రహదారిపై మీర్జాగూడ సమీపంలో ఎదురుగా వచ్చిన కంకరలోడ్ టిప్పర్ ఢీకొట్టింది.

టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చినందుకే ఈ ప్రమాదం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బస్సు, టిప్పర్ ఢీకొట్టడంతో టిప్పర్ లోడ్‌లో ఉన్న కంకర ప్రయాణికుల మీద పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో చాలా మంది గాయాలపాలై ప్రాణాలు వదిలారు. ఈ బస్సులో సుమారు 72మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. పోలీసులు, ఫైర్-బ్రిగేడ్, స్థానికులు మూడు జేసీబీల సాయంతో సహాయకచర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలించారు. తీవ్రగాయాల పాలైనవారిని హైదరాబాద్‌కు తరలించారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో అత్యవసర వార్డుల ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెల్లు దుర్మరణం

ఈ రోడ్డు ప్రమాదం అనేక కుటుంబాలను శోకసంద్రంలో ముంచెత్తింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్‌కు ముగ్గురు కుమార్తెలు తనూష, సాయిప్రియ, నందిని. వీళ్లు ముగ్గురూ హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాలలో చదువుకుంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో తాండూరులో తమ తల్లిదండ్రులతో గడిపి, సోమవారం ఉదయం హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో ఎక్కారు. కానీ వారిని సిటీ చేరకముందే చావు పట్టుకుంది. తండ్రి ఎల్లయ్య గౌడ్, తల్లి మల్లమ్మ తమ ముగ్గురు పిల్లల మృతదేహాలను చూసి విలపించారు.

ఎంబీఏ విద్యార్థిని దుర్మరణం

ఈ రోడ్డు ప్రమాదంలో కాలేజీకి వెళ్లేందుకు బయలుదేరిన ఎంబీఏ విద్యార్థిని అఖిల (22) కూడా మృతి చెందింది. అఖిల యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి కుమార్తె. అఖిల మృతి చెందడటంతో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ప్రధాని Modi సంతాపం

చేవెళ్ల(Chevella) రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

సీఎం Revanth Reddy దిగ్బ్రాంతి .. మృతుల కుటుంబాలకు పరిహారం

రోడ్డు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన వివరాలను తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్‌, డీజీపీ, సీఎస్‌లతో మాట్లాడారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో స్పందించాల‌ని ఆయన ఆదేశించారు. ‘ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి. కుటుంబాలు కోలుకోలేని దుఃఖం ఇది. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించేందుకు ప్రభుత్వం అంకితంగా పనిచేస్తుంది’ అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించి గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయమని, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని తక్షణం హైదరాబాద్‌కు తరలించమని సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం అందజేయబోతున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

Read Also: ఆ సినిమా నా మీద ఎంతో ప్రభావం చూపింది : సందీప్ రెడ్డి వంగా

Follow Us On : Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>