కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు (Municipal Elections )ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇప్పటికే గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లు ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే ఉన్నాయి. వాటికి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. జనవరి 1న ముసాయిదా ఓటర్ల లిస్టును ప్రకటించింది. ఈ నెల 5న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయా మున్సిపల్ కమిషనర్లు సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా ఫైనల్ ఓటర్ లిస్టును ఈ నెల 10న మున్సిపల్ కమిషనర్లు అందజేస్తారు. ఓటర్ల ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత రిజర్వేషన్లు కూడా ఖరారు చేయబోతున్నారు. ఈ నెల మూడో వారంలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీ అవుతోంది.
ఆ తర్వాత వారంలోపే కలెక్టర్లు ఆయా మున్సిపాలిటీల్లో నోటీసులు ఇచ్చేస్తారు. నామినేషన్లు కూడా స్టార్ట్ అయిపోతాయి. ఆయా జిల్లాల పరిధిలోని అధికారులు ఎన్నికలకు (Municipal Elections )పటిష్టమైన ఏర్పాట్లు చేయబోతున్నారు. ఈ సారి బ్యాలెట్ పేపర్ తోనే ఎన్నికలు నిర్వహిస్తారా లేదంటే ఈవీఎంలు వాడుతారా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఫిబ్రవరి 10లోపు విడతల వారీగా 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. స్టూడెంట్లకు ఎగ్జామ్ సెషన్ మొదలయ్యేలోపే ఈ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల తర్వాత పార్టీ గుర్తులతో జరుగుతున్న ఎన్నికలు ఇవే. పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల టెక్నికల్ పరమైన ఇబ్బందులు వచ్చాయి కాబట్టి.. ఈ అర్బన్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల రిజల్ట్ వచ్చిన వెంటనే కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టబోతున్నాయి. కొత్త పాలకవర్గాలు వచ్చిన తర్వాత వాటి అభివృద్ధి కోసం నిధులు సమీకరించబోతున్నారు.
Read Also: సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ పిలుపు
Follow Us On: Pinterest


