కలం, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో (Phone Tapping Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి నోటీసులు జారీచేసింది. సీఎం రేవంత్ ఫ్యామిలీలో ఫస్ట్ నోటీసు జారీ కొండల్‌రెడ్డికి జారీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నోటీసు ప్రకారం గురువారం ఉదయం 10 గంటలకు జూబ్లీ హిల్స్ పోలీసుల ముందు కొండల్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉన్నది. ఆయన వాంగ్మూలాన్ని కూడా పోలీసులు రికార్డు చేయనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ జరిగిన సందర్భంలో ఆయన ఎవరితో మాట్లాడారు, వ్యక్తిగత సమాచారం ఏ మేరకు లీక్ అయింది, ఆ తర్వాత ఇది ఏ రూపంలో అప్పటి పోలీసులు, ప్రభుత్వం దుర్వినియోగం చేసింది తదితర అంశాలపై గురువారం విచారణలో పోలీసులు కొండల్ రెడ్డి అభిప్రాయాలను సేకరించనున్నారు. ముఖ్యమంత్రి సోదరుడినే సిట్ పోలీసులు విచారణకు పిలవడంతో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతున్నదనే సంకేతం ఇచ్చినట్లయిందన్న మాటలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించిన ప్రభాకర్‌రావును ఇటీవల రెండు వారాల పాటు విచారించిన సందర్భంగా వెలుగులోకి వచ్చిన అంశాలను కొండల్ రెడ్డి విచారణ సందర్భంగా పోలీసులు ప్రస్తావించే అవకాశమున్నది. కొండల్ రెడ్డి ఎలాంటి అంశాలను వెల్లడిస్తారు.. వాంగ్మూలంలో ఏయే అంశాలను ప్రస్తావిస్తారు.. ఇవి ఆసక్తికరంగా మారాయి.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి తనకు తెలిసిన సమాచారం ఇవ్వాలని, అలాగే కొన్ని అంశాలపై స్పష్టత కోరేందుకే నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. విచారణలో భాగంగా కొండల్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరై వివరాలు వెల్లడించాలని సెట్ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు మాజీ అధికారులు, పోలీసు విభాగానికి చెందిన కీలక వ్యక్తులను సెట్ విచారించింది. తాజాగా సీఎం సోదరుడిని కూడా విచారణ పరిధిలోకి తీసుకోవడంతో, ఫోన్ ట్యాపింగ్ కేసు మరింత కీలక మలుపు తిరిగినట్లుగా భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ విచారణలో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Read Also: ఫార్మా కంపెనీ రగడ.. ఉద్యమం చేస్తామని రైతుల వార్నింగ్
Follow Us On: X(Twitter)


