కలం, వరంగల్ బ్యూరో : మేడారంలో ఖాళీ స్థలాల అద్దేలు ఆకాశన్నంటుతున్నాయి. మహా జాతర (Medaram Jatara) సందర్బంగా ఇక్కడి భూముల ధరలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. జాతరలో వ్యాపారాలు చేసుకునేందుకు వ్యాపారస్థులు స్థానిక రైతుల నుంచి భూములు అద్దెకు తీసుకుంటారు. అది కూడా కేవలం వారం రోజులకు మాత్రమే. ఆయా ఖాళీ స్థలాల్లో చిన్న పరదాలతో గదులు, గుడారాలు ఏర్పాటు చేసుకొని అద్దెకు ఇస్తుంటారు. ఒక్కో గది లేదా గుడారానికి రోజుకు రూ. 500 నుంచి 2000 వరకు వసూలు చేస్తుంటారు.
అద్దె ఇండ్లకు ఫుల్ డిమాండ్
మేడారం చిన్న కుగ్రామం. రెండేళ్లకోసారి జరిగే జాతరకు కోటి మందికి పైగా భక్తులు వస్తుంటారు. జాతరలో భక్తులు విడిది చేసేందుకు లాడ్జిలు, హోటల్స్ ఉండవు. హరిత కాకతీయ హోటల్ ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బుకింగ్ ఉండటం వల్ల దొరకడం కాస్తా ఇబ్బందిగానే ఉంటుంది. దీనికి తోడు సామాన్యులకు ధరలు అందుబాటులో ఉండని కారణంగా పెద్దగా ఆసక్తి చూపరనే చెప్పాలి. ఈ క్రమంలో స్థానికులు ఇండ్లు అద్దెకు ఇస్తుంటారు. ఒక్కో గదికి పెద్ద మొత్తంలో కిరాయి డిమాండ్ చేస్తారు. ప్రధానంగా వ్యాపారులు వస్తువుల నిల్వల కోసం గదులు అద్దెకు తీసుకుంటారు. అదే విధంగా జాతర విశేషాలను కవర్ చేసేందుకు వచ్చే పలు మీడియా సంస్థలు అక్కడే ఆఫీస్ లు ఏర్పాటు చేసుకుంటారు. ఇంటి యజమానులు నాలుగు రోజులకే రూ. 30 వేల నుంచి 50 వేల వరకు డిమాండ్ చేస్తారు.
ఖాళీ స్థలాలతో వ్యాపారం..
Medaram Jatara కు నెల రోజుల ముందు నుంచే భక్తులు వస్తుంటారు. ఆదివారం ఒక్కరోజే లక్షలాదిగా జనం తరలి వస్తుంటారు. ఈ క్రమంలో భక్తుల సౌకర్యం కోసం చిరు వ్యాపారులు దుకాణాలు తెరుస్తారు. స్థానిక రైతులకు చెందిన పొలాలను అద్దెకు తీసుకొని షాప్స్ ఏర్పాటు చేసుకుంటారు. ప్రస్తుతం ఇక్కడ గజం స్థలం రూ. 10 వేల వరకు పలుకుతోంది. ముందస్తుగానే రైతులతో మాట్లాడుకుని అడ్వాన్స్ చెల్లించి దుకాణాలు ఏర్పాటు చేసుకుంటారు. మేడారంలో కిరాణా షాప్స్, చిరుతిళ్ల దుకాణాలు, కూల్ డ్రింక్ షాప్స్, బెల్లం, బొమ్మలు, హోటల్స్, చికెన్ సెంటర్లు, సర్కస్, ఎగ్జిబిషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు.
Read Also: ఈ నెల 18న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి: సీతక్క
Follow Us On : WhatsApp


