అసైన్డ్ భూములపై సర్కార్ కీలక నిర్ణయం.. రెవెన్యూ శాఖ రిపోర్ట్

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని అసైన్డ్ భూముల (Assigned Lands) అన్యాక్రాంతంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన ఆ భూములు అన్యాక్రాంతం అయినట్లు రెవెన్యూ శాఖ గుర్తించింది. జిల్లాల వారీగా వివరాలను సేకరించి సమగ్రమైన రిపోర్టు తయారుచేసింది. దీన్ని ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికలో అనేక ఉదాహరణలను ప్రస్తావించింది. ప్రస్తుతం ఆ భూముల పరిస్థితి ఎలా ఉన్నదో, అసలైన లబ్ధిదారులు ఎవరో, వాటిని తిరిగి ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటే ఏ అవసరాలకు వినియోగించవచ్చో ప్రభుత్వం ఆలోచిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షల ఎకరాల అసైన్డ్ భూములు చేతులు మారినట్లు రెవెన్యూ శాఖ అధికారులు ప్రభుత్వానికి అందించిన నివేదిలో పేర్కొన్నారు. ఇకపైన ఈ భూములను వివిధ అభివృద్ధి పనులు, పరిశ్రమల స్థాపన కోసం వినియోగించాలని ప్రభుత్వం భావిస్తున్నది.

అసైన్డ్ భూములకు పాస్ బుక్‌లు లేవు :

అసైన్డ్ భూముల వినియోగంలో అనేక లొసుగులు ఉన్నట్లు గత ప్రభుత్వం ఒక అంచనాకు రావడంతో అసైన్డ్ భూములతో పాటు ఇనాం భూములకు పాసు పుస్తకాల జారీ చేయలేదు. ఆ భూములను కొనుగోలు చేసినవారు పట్టాలు దక్కవేమోననే ఆందోళనలో పడ్డారు. ఈ కారణంగానే పట్టాలు జారీ చేయాలంటూ అప్పుడప్పుడూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వివిధ రూపాల్లో ఒత్తిడి పెంచుతున్నారు. గతంలో లబ్ధిదారులకు కేటాయించిన భూములను చాలామంది అమ్ముకున్నారు. ఒరిజినల్‌గా పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములెన్ని.. ప్రస్తుతం ఎంత భూమి వాళ్ల దగ్గర ఉంది.. మిగిలిన భూమి ఎవరి ఆధీనంలో ఉన్నది.. ఆ భూములను ఎప్పుడు విక్రయించారు.. ఇలాంటి అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. జిల్లాలవారీగా వివరాలన్నీ కలెక్టర్లు, సీసీఎల్ఏ, రెవెన్యూ శాఖతో పాటు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి.

ఇతర రాష్ట్రాల్లోని పాలసీపై అధ్యయనం :

ఇతర రాష్ట్రాల్లో అసైన్డ్ భూములకు (Assigned Lands) సంబంధించిన విధానాలు ఎలా అమలవుతున్నాయో రాష్ట్ర రెవెన్యూ శాఖ అధికారులు ఇప్పటికే అధ్యయనం చేశారు. ప్రభుత్వ ఆదేశం మేరకు పలు రాష్ట్రాల్లో పర్యటించి వివరాలను సేకరించారు. అక్కడి విధానాలను పరిశీలించారు. వాటన్నింటిపై ప్రభుత్వానికి నివేదికను అందించారు. గతంలో పంపిణీ చేసిన అసైన్డ్ భూముల్లో కమర్షియల్ భూములు కాకుండా వ్యవసాయ భూములను మాత్రమే ఈసారి నిరుపేదలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అసైన్డ్ భూముల వ్యవహారం చాలా సున్నితమైన అంశం కావడంతో పాటు సాగుభూమి లేని పేదలకు ఈ విధానాన్ని తీసుకొచ్చిందే గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కావడంతో ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆచి తూచి అడుగేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నది. అన్ని వైపుల నుంచి ఆలోచించిన తర్వాతనే స్పష్టమైన నిర్ణయానికి రావాలనుకుంటున్నది.

రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాలకు పైగానే… :

పేదలకు జీవనోపాధి కల్పించేందుకు అసైన్డ్ భూములను ఇచ్చే విధానం 1954 నుంచే అమల్లోకి వచ్చింది. ఆ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే భూ పంపిణీ మొదలైంది. తెలంగాణ ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటే సుమారు 13 లక్షల మంది పేదలకు 22.52 లక్షల ఎకరాలకు పైగా భూమిని ప్రభుత్వం పంపిణీ చేసినట్లు తేలింది. 2017 తర్వాత వివిధ కారణాలతో అసైన్డ్, ఇనాం భూముల లబ్ధిదారులకు పట్టాల జారీని ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పటికీ సుమారు ఏడున్నర లక్షల ఎకరాల భూములకు కొత్త పాసు పుస్తకాలు జారీ కాలేదు. భూములను సాగు చేయకపోవడం, చేతులు మారడం వంటి కారణాలతో ఎక్కువ శాతం భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. సాగుకు యోగ్యంగా లేని భూములకు సైతం పట్టాదారు పాస్ బుక్కులను ఇవ్వకూడదని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ఎలాంటి విధానం తీసుకోవాలన్నదానిపై ప్రభుత్వం మేధోమధనం చేస్తున్నది.

సాగుకు పనికిరాని మూడున్నర లక్షల ఎకరాలు :

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 22,52,340.37 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయి. మొత్తం 15,87,021 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం అప్పట్లో ఈ భూములను కేటాయించింది. అందులో 3,55,441.62 ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలం కాదని ప్రభుత్వం తాజాగా గుర్తించింది. ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 1.85 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉంటే అందులో 1.78 లక్షల ఎకరాలు వ్యవసాయానికి అనుకూలమని అధికారులు గుర్తించారు. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 291 ఎకరాల భూమి ఉండగా, అందులో ఒక్క ఎకరంలో కూడా సాగు జరగడం లేదని అధికారులు ఆ నివేదికలో స్పష్టం చేశారు. వ్యవసాయానికి అనుకూలం కాని భూములు ఎక్కువగా నల్లగొండ జిల్లాలోనే ఉన్నాయి. అక్కడ మొత్తం 1.38 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉంటే అందులో కేవలం 1,386 ఎకరాల్లో మాత్రమే పంట సాగవుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేటాయించిన భూమి మొత్తం సాగుకు అనుకూలంగా ఉందని అధికారులు గుర్తించారు.

సిటీ శివారు ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితి :

నగరానికి ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని అసైన్డ్ భూములకు మిగిలిన జిల్లాలతో పోలిస్తే విచిత్రమైన పరిస్థితి. ఈ భూములున్న యజమానులు ప్రభుత్వం నుంచి పట్టాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ జిల్లాల్లోని అనేక ప్రాంతాలు గత పదేండ్ల కాలంలో మున్సిపాలిటీలయ్యాయి. చాలా మంది అసైన్డ్ భూమి యజమానులు (రైతులు) ఇతరులకు అమ్ముకున్నారు. కొనుక్కున్నవారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశమే లేకుండాపోయింది. అలాంటి భూముల్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నది.

దీంతో ప్రస్తుతం ఆ భూములను కొనుగోలు చేసిన రైతులు పట్టాలు రావడంపై ఆందోళనకు గురవుతున్నారు. పట్టాలివ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గతంలో రంగారెడ్డి జిల్లాలో 1.27 లక్షల ఎకరాలు, మెదక్‌ జిల్లాలో 2.55 లక్షల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 1.82 లక్షల ఎకరాలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2.06 లక్షల ఎకరాల భూములను ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రస్తుతం వీటిలో సుమారు 1.50 లక్షల ఎకరాల భూమి చేతులు మారినట్లు అధికారుల పరిశీలనలో తేలింది.

అసైన్డ్ భూములపై హక్కులెవరికి :

అసైన్డ్ భూములను 1958 జూలై నెలకు ముందు పొందిన రైతులకే విక్రయ హక్కులు ఉంటాయని 2014 మార్చిలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం లబ్ధిదారులు వారి పేరుతో ఉన్న భూములను ఇతరులకు విక్రయించుకోవచ్చు. ఇనాం భూములకు అధీకృత ధ్రువపత్రం జారీ చేసి పట్టాలు ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికీ, చాలా జిల్లాల్లో అవి అమలు కావడం లేదు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో సుమారు లక్ష ఎకరాలకు పైగా భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్లు, నోటరీల ద్వారా బదలాయింపు అయినట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు.

నిబంధనలు ఉల్లంఘించి పేదల నుంచి భూములను కొనుగోలు చేసినవారి దగ్గరి నుంచి ఆ భూములను స్వాధీనం చేసుకోవడంపై అధికారుల స్థాయిలో పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. ఇప్పటికే జిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఫార్మ్ హౌస్‌లు నిర్మించిన వారికి రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో అసైన్డ్ భూములకు (Assigned Lands) పట్టాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పట్టాలు జారీ చేస్తుందా? లేక అన్యాక్రాంతం అయిన భూములను స్వాధీనం చేసుకుంటుందా? అనే విషయాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశమున్నది.

Read Also: ప్రైవేటు విద్యపై నో కంట్రోల్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>