కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రజలే కేంద్రంగా పరిపాలన సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. విప్లవాత్మకమైన పాలసీలను రూపొందించిందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Governor Shiv Pratap Shukla) వ్యాఖ్యానించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఇందిరా మహిళా శక్తి, తెలంగాణ టూరిజం, స్పోర్ట్స్, తెలంగాణ రైజింగ్ (Telangana Rising), హిల్ట్, క్లీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్ పాలసీలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. దీనికి తోడు 99 రోజుల ప్రగతి ప్రణాళికకు శ్రీకారం చుట్టిందన్నారు. పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, పారిశుద్య నిర్వహణ తదితరాలతో పరిపాలనను ప్రజలకు చేరువ చేస్తోందని కొనియాడారు.
వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, రోడ్డు భద్రత తదితరాలపై ప్రధాన దృష్టి సారించిందని చెప్పారు. ప్రజల సమస్యలకు పరిష్కారం కనుగొని ప్రభుత్వం నుంచి సేవలందించే లక్ష్యంతో ప్రజావాణి కార్యక్రమాన్ని తొలి రోజు నుంచే ప్రారంభించిందన్నారు. ఇప్పటిదాకా 64,697 పిటిషన్లు వస్తే అందులో 47,760 పరిష్కారమయ్యాయని స్పష్టం చేశారు. ఇది నిరంతరం జరుగుతున్న ప్రక్రియగా అమలవుతోందని ఆయన (Governor Shiv Pratap Shukla) చెప్పారు. ప్రజల మధ్య విద్య, సామాజిక, ఆర్థిక అంతరాలు లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కులగణన సర్వే(Caste Census Survey) చేపట్టి వివరాలను సేకరించిందని తెలిపారు.
ప్రతీ సామాజికవర్గాన్ని గుర్తించేలా, వారి గొంతు విప్పే విధంగా సోషల్ జస్టిస్, ఇంక్లూజివ్ గవర్నెన్స్ తదితరాలకు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారో గుర్తించి వారికి విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ కల్పించేలా చట్టాన్ని రూపొందించిందని గుర్తు చేశారు. రాష్ట్రపతి ఆమోదం కోసం గతేడాది పంపిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు సోషల్ జస్టిస్ లభించేలా చరిత్రలోనే ఇది ఒక కీలక ఘట్టంగా నిలువనుందని అభిప్రాయపడ్డారు. దీనికి తోడు ఎస్సీలోని 59 కులాలు, ఉప కులాలను వర్గీకరించేలా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చట్టం తీసుకొచ్చిందన్నారు. ఎస్సీల్లోని అన్ని కులాలు, ఉప కులాలకు సమ న్యాయం జరిగేలా చట్టం తీసుకొచ్చి దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కొనియాడారు.
Read Also: ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్.. విద్యార్థులకు పాఠాలు
Follow Us On: Facebook

