కలం డెస్క్ : ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల (Outsourcing Employees) నియామకాలపై వచ్చిన ఆరోపణలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడమే ఉత్తమమైన మార్గమని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే ఆధార్ కార్డు వివరాల సేకరణ కొనసాగుతూ ఉన్నది. జనవరి 26కల్లా ఈ ప్రక్రియ పూర్తికావాలని ప్రభుత్వం ఇటీవలే ఆదేశించింది. అయితే నియామకాలను నియంత్రించడానికి, ఏజెన్సీల అవినీతిని అరికట్టడానికి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని మాజీ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి (Former CS Shanthi Kumari) నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. దీనిపై కొద్దిమంది అధికారులతో చర్చించిన తర్వాత కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయనే ఉద్దేశంతో ప్రస్తుతానికి నిర్ణయం తీసుకోకుండా హోల్డ్ లో పెట్టినట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది.
ఆధిపత్యం పెరుగుతుందనే భావన :
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల(Outsourcing Employees) నియామకాల్లో అవకతవకలను నివారించడానికి వీలుగా ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసేలా శాంతికుమారి కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అందరినీ ఒకే గొడుగు కిందికి తీసుకురావాలన్నది ఈ ప్రతిపాదన ఉద్దేశం. అవకతవకలను నివారించడానికి ఈ ఆలోచన ఉపయోగపడినా వేలాది మందిని ఈ కార్పొరేషన్ ద్వారా నియమిస్తే యూనియన్ ఏర్పాటు లాంటివి చోటుచేసుకునే అవకాశముందన్న అభిప్రాయాన్ని కొందరు ఆఫీసర్లు వ్యక్తం చేసినట్లు తెలిసింది. కార్పొరేషన్ ద్వారా మరికొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉంటాయని అభిప్రాయపడినట్లు సమాచారం. వైఎస్సార్ హయాంలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నియమితులైనవారిని రెగ్యులర్ చేయాల్సి వచ్చిందని, కార్పొరేషన్ లాంటి వ్యవస్థ ఉనికిలోకి వస్తే రెగ్యులర్ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలనే డిమాండ్లు వారి నుంచి వస్తాయన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.
ఒకే ఏజెన్సీగా ఉంటుంది కాబట్టి డిమాండ్ల రూపంలో ప్రభుత్వంపైన ఒత్తిడి కూడా పెరుగుతుందన్న అంశాన్ని ప్రస్తావించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతానికి ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చేలా కార్పొరేషన్ ఏర్పాటు అనే అంశాన్ని ప్రభుత్వం పక్కకు పెట్టినట్లు తెలిసింది.
Read Also: ఫ్లై ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్స్ @ తెలంగాణ
Follow Us On: Youtube


