కలం వెబ్ డెస్క్ : క్రిస్మస్ (Christmas) పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి (Revanth Reddy), నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఎక్స్ వేదికగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధించిన ప్రేమ, క్షమ, సేవ, శాంతి విలువలు సమాజానికి ఎంతగానో అవసరమని వారు తమ సందేశాల్లో పేర్కొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. శాంతిదూత ఏసుక్రీస్తు జన్మదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. క్రీస్తు చూపిన ప్రేమ, సహనం, సేవ వంటి విలువలు నేటి సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. అలాగే క్రైస్తవ మత విశ్వాసాన్ని నిలబెట్టే పాస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 8,418 మంది క్రైస్తవ పాస్టర్లకు నెలకు రూ.5 వేల చొప్పున గత 12 నెలల గౌరవ వేతనాలుగా ఒకేసారి రూ.51 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఇది క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సూచిస్తుందన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సందేశంలో మానవాళికి ప్రేమను పంచడం, ప్రపంచ శాంతిని కాంక్షించడం ఏసుక్రీస్తు ఇచ్చిన ప్రధాన సందేశమని తెలిపారు. ఆ సందేశం సకల జనులకు ఆచరణీయమని పేర్కొన్నారు. క్రిస్మస్(Christmas) పర్వదినం అందరిలో మానవీయ విలువలను మరింత బలపరచాలని ఆకాంక్షించారు.
Read Also: పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల
Follow Us On: Instagram


