కలం, వెబ్‌డెస్క్ : తెలంగాణ (Telangana) కేంద్రంగా కొత్త ఎయిర్‌లైన్స్ సంస్థ త్వరలో ఉనికిలోకి రానున్నది. ఈ రాష్ట్రానికి చెందిన ఫ్లైట్లు ఇక ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేయనున్నాయి. ఫ్లై ఎక్స్‌ప్రెస్ ఎయిర్‌లైన్స్ (Fly Express Airlines) పేరుతో ఈ కొత్త సంస్థ తన సేవలను త్వరలో ప్రారంభించనున్నది. పౌర విమానయాన శాఖ (Civil Aviation) నుంచి ఇప్పటికే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (No Objection Certificate) మంజూరైంది. మొత్తం మూడు ఎయిర్‌లైన్స్ కంపెనీలకు ఎన్ఓసీ జారీచేయగా అందులో హైదరాబాద్ కేంద్రంగా రిజిస్టర్ అయిన ఫ్లై ఎక్స్‌ప్రెస్ ఎయిర్‌లైన్స్ కూడా ఒకటి. త్వరలోనే అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుని ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ (Air Operator Certificate) కూడా అందుకుంటే ఇక కమర్షియల్ సర్వీసెస్ (Commercial Operations) ప్రారంభించడానికి మార్గం సుగమమైనట్లే. దాదాపు ఏడాది కాలం పట్టొచ్చని డీజీసీఏ (DGCA) వర్గాల సమాచారం. ఇండిగో (Indigo) ఎయిర్‌లైన్స్ ఇటీవల సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో కొత్తగా మూడు సంస్థలు ఉనికిలోకి రావడం గమనార్హం.
ధ్రువీకరించిన రామ్మోహన్ నాయుడు :
కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మూడు కొత్త విమానయాన సంస్థలు వచ్చే ఏడాది నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తాయని ‘ఎక్స్’ వేదికగా ధ్రువీకరించారు. ఫ్లై ఎక్స్‌ప్రెస్ తరఫున ప్రతినిధులు కూడా రామ్మోహన్ నాయుడితో ఇటీవల భేటీ అయ్యి ఎన్ఓసీ మంజూరైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఫ్లై ఎక్స్‌ప్రెస్ ఎయిర్‌లైన్స్ (Fly Express Airlines) తో పాటు అల్ హింద్ ఎయిర్, శంఖ్ ఎయిర్ సంస్థలకు కూడా ఎన్ఓసీ మంజూరైంది. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా కొరియర్ అండ్ కార్గో సర్వీసెస్ సంస్థ రూపంలో జాతీయ, అంతర్జాతీయ కొరియర్ సేవలను అందిస్తున్న ఫ్లై ఎక్స్‌ప్రెస్ త్వరలో ఎయిర్‌లైన్స్ రంగంలోకి కూడా విస్తరించనున్నది. ఈజిప్టులోని కైరో కేంద్రంగా నడిచే ఫ్లై ఎక్స్‌ప్రెస్ ఎయిర్‌లైన్స్ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం.
‘ఇండిగో’ సంక్షోభం తర్వాతి పరిణామం :
డీజీసీఏ(DGCA) ఇటీవల తీసుకొచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలతో ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభంలో చిక్కుకున్నది. ప్రయాణికులు ఇబ్బందులపాలయ్యారు. రోజుల తరబడి వందలాది విమానాల సర్వీసులు అర్ధంతరంగా రద్దయ్యాయి. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే చిక్కుకుని అవస్థలుపడ్డారు. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసురావాల్సి వచ్చింది. పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టక తప్పలేదు. దేశంలోని మొత్తం విమాన సర్వీసుల్లో ప్రస్తుతం ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థల భాగస్వామ్యం దాదాపు 90% కాగా విస్తారా, ఆకాశ ఎయిర్ తదితర సంస్థలన్నింటివీ కలిపి కేవలం 10 శాతమే. ఇండిగో సంక్షోభంతో తలెత్తిన ఇబ్బందులను ఎయిర్ ఇండియా సర్దుబాటు చేయలేకపోయింది. దీంతో కొత్త విమానయాన సంస్థల అవసరం ఏర్పడింది. అందులో భాగమే తాజాగా ఎన్ఓసీ అందుకున్న మూడు సంస్థలు.
ఆధిపత్యాన్ని అరికట్టే దిశగా చర్యలు :
దేశంలోని విమాన సర్వీసుల్లో ఎయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్‌లైన్స్ కంపెనీలదే ఆధిపత్యం. ఇందులో ఇండిగో సర్వీసులే దాదాపు 65% ఉన్నాయి. తాజా సంక్షోభంతో ప్రయాణికులకు ఇబ్బందులు రావడంతో ప్రత్యామ్నాయం గురించి కేంద్రం ఆలోచించింది. కొత్త విమానయాన సంస్థలను ఆహ్వానిస్తే ఆధిపత్యానికి చెక్ పెట్టవచ్చని భావించింది. ఇప్పటికే ‘ఉడాన్’ (UDAN) పథకం కింద స్టార్ ఎయిర్, ఇండియా వన్ ఎయిర్, ఫ్లై-91 వంటి చిన్న ఎయిర్‌లైన్స్ డొమెస్టిక్ విమానాల సర్వీసులను నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు కొత్త విమానయాన సంస్థలు వస్తుండడంతో దేశ విమానయాన రంగం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.
Read Also: అక్కడ కోడళ్లకు ఫోన్లు నిషేధం.. కారణం తెలిస్తే అవాక్కవుతారు
Follow Us On: X(Twitter)


