‘భరోసా’తో బాధితులకు అండ : డీజీపీ శివధర్ రెడ్డి

కలం, నల్లగొండ బ్యూరో : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి (Shivadhar Reddy) పర్యటన సందడిగా కొనసాగింది. సోమవారం జిల్లాలో పర్యటించిన ఆయన, అడిషనల్ డీజీపీ మహేష్ ఎం. భగవత్‌తో కలిసి పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులకు తక్షణ సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన ‘భరోసా’ కేంద్రాన్ని డీజీపీ ప్రారంభించారు. బాధితులకు కౌన్సెలింగ్, న్యాయ సహాయం, వైద్య సేవలు ఒకే చోట అందించడమే ఈ కేంద్రం లక్ష్యమని తెలిపారు. అనంతరం జిల్లా పోలీస్ యంత్రాంగం కోసం నూతనంగా నిర్మించిన పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు.

డీజీపీ(Shivadhar Reddy) మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. వాటిని ఎదుర్కొనేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉండాలని సూచించారు. అలాగే డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, యువతను వ్యసనాల నుంచి కాపాడాలని ఆదేశించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేసేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్‌తో పాటు పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>