కేరళ సీఎంకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

కలం, వెబ్ డెస్క్ : కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణలో ఏం సాధించింది? అంటూ కేరళ సీఎం పినరయి విజయన్ చేసిన ట్వీట్లకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఏకంగా ఆరు పేజీల సుదీర్ఘ లేఖను సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేరళ అభివృద్ధి మోడల్‌లోని లోపాలను సీఎం రేవంత్ రెడ్డి ఎత్తిచూపుతూనే.. తెలంగాణలో గత 28 నెలల్లో సాధించిన స‌మ‌గ్ర‌, స‌మ్మిళిత‌, సంపూర్ణ ప్రగతిని రేవంత్ రెడ్డి లేఖలో స్ప‌ష్టంగా వెల్ల‌డించారు.

దక్షిణాదిలోనే తెలంగాణ టాప్

పినరయి విజయన్ చేసిన ట్వీట్లు తెలంగాణలో గత ప్రభుత్వ (BRS) పాలన చివరి దశకు సంబంధించినవని రేవంత్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ జీఎస్‌డీపీ (GSDP) 10.1% వృద్ధి రేటుతో జాతీయ సగటు (9.9%) కంటే ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. దక్షిణాదిలోనే అత్యధిక తలసరి ఆదాయం (రూ.3.79 లక్షలు) కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని లేఖలో వెల్లడించారు.

సంక్షేమంలో తెలంగాణ దూకుడు

సంక్షేమం, నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించడంలో తెలంగాణకు కేరళకు పొంతనే లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సంక్షేమంలో తాము దూకుడుగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా, రూ.2 లక్షల వరకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, మరియు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. ల్లిదండ్రుల రక్షణ బిల్లు, గిగ్ వర్కర్ల రక్షణ బిల్లు వంటి సామాజిక చట్టాలను ఆమోదించి, ఆచ‌ర‌ణ దిశ‌గా ముందుకు క‌దులుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో కేవలం 28 నెలల్లోనే 67,763 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టామని, హైదరాబాద్‌ను గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) హబ్‌గా మార్చామని వివరించారు. అయితే కేరళలో యువత ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారని, అక్కడ పారిశ్రామికాభివృద్ధి కుంటుపడిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.

బీజేపీతో దోస్తీ.. సీఎం రేవంత్ సెటైర్

కాంగ్రెస్‌ను బీజేపీ ‘బి-టీమ్’ అని విమర్శిస్తున్నారు. కానీ నిజానికి కేరళ సామాన్య ప్రజలు విజయన్ ప్రభుత్వంలోనే కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి బీ టీమ్ గా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని అంటున్నారని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని వేధిస్తోందని, కానీ కేరళ సీఎం కార్యాలయంపై వస్తున్న ఆరోపణల విషయంలో సీబీఐ ఎందుకు మౌనంగా ఉందో ప్రజలకు అర్థం అయిపోయిందని చెప్పారు. ఏప్రిల్ 7న తిరువనంతపురం వచ్చి నేరుగా గణాంకాలతో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నా అంటూ.. చివరిలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ‘నరసింహం’ సినిమాలోని ప్రసిద్ధ డైలాగ్ “నీ పో మోనే విజయన్” (నువ్వు వెళ్లు బాబు విజయన్) అని ఉటంకిస్తూ కేరళ సీఎంకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. తెలంగాణ అభివృద్ధిని విమర్శించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలంటూ లేఖ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి కేరళ సీఎంకు హితవు పలికారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>