కలం, వెబ్ డెస్క్: ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొత్తం 146 పోస్టులకు ప్రమోషన్లు దక్కనున్నాయి. 2021 నుంచి పెండింగ్లో ఉన్న ప్రమోషన్లకు తాజాగా ప్రభుత్వ క్లియరెన్స్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫైళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజముద్ర వేశారు. ప్రమోషన్లకు సంబంధించని ప్రక్రియ ప్రారంభించినట్టు ఆర్టీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం సోమవారం మీడియాకు తెలిపారు. 2021 తర్వాత నిలిచిపోయిన గెజిటెడ్ కేడర్ల ప్రమోషన్లకు ఎట్టకేలకు మార్గం సుగమం కావడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2025-26 ప్యానల్ సంవత్సరానికి సంబంధించిన Departmental Promotion Committee (DPC) సమావేశం సోమవారం విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రమోషన్లకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు.
ప్రమోషన్లు దక్కేది ఈ అధికారులకే..
అసిస్టెంట్ మేనేజర్ (T) – 46
అసిస్టెంట్ ఇంజనీర్ (మెకానికల్) -23
అసిస్టెంట్ మేనేజర్ (పర్సనల్) -24
అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్) -24
అసిస్టెంట్ మేనేజర్ (మెటీరియల్స్)- 15
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)- 10
చీఫ్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్- 04
మొత్తం 146 పోస్టుల ప్రమోషన్లకు మార్గం సుగమం అయ్యింది. సంస్థలో ఉన్న మొత్తం ఖాళీలను దృష్టిలో ఉంచుకుని 214 పోస్టులకు ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభించగా, మొదటి విడతగా 146 మంది ఉద్యోగులను అర్హులుగా ఎంపిక చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రమోషన్ల ద్వారా సంస్థలో పరిపాలనా సామర్థ్యం పెరగడంతో పాటు, ఉద్యోగుల్లో నూతన ఉత్సాహం నెలకొంటుందని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం సంస్థ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో కూడా ప్రమోషన్ల ప్రక్రియను నిరంతరంగా కొనసాగిస్తామని తెలిపారు.

