ఈ నెల 23న క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ…

కలం, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి అధ్యక్షతన సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో క్యాబినెట్ భేటీ (Telangana Cabinet Meet) జరగనున్నది. బడ్జెట్ సమర్పించడానికి ముందు శుక్రవారం ఉదయం క్యాబినెట్ భేటీ జరగ్గా మళ్లీ రెండు రోజుల వ్యవధిలోనే సోమవారం సాయంత్రం జరిపేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. కీలకమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున సచివాలయానికి బదులుగా అసెంబ్లీలోనే క్యాబినెట్ భేటీ జరుగుతున్నది. ఈ నెల 23 సాయంత్రం 5.00 గంటలకు క్యాబినెట్ భేటీకి మంత్రులంతా హాజరు కానున్నారు. బడ్జెట్‌పై (Budget 2026) సోమ, మంగళవారాల్లో అసెంబ్లీలో, కౌన్సిల్‌లో చర్చ జరగనున్నది. వివిధ పార్టీల సభ్యులు వారి అభిప్రాయాలను వెల్లడించనున్నారు. మొదటి రోజు చర్చ (సోమవారం)లు జరుగుతుండగానే సాయంత్రానికి క్యాబినెట్ భేటీ షెడ్యూలు ఫిక్స్ చేయడం కీలకంగా మారింది.

వ్యూహ రచన కోసమా?.. వివరణ ఇచ్చేందుకా? :

బడ్జెట్‌ను బీఆర్ఎస్ (BRS) సభ్యులు వ్యతిరేకించడంతో పాటు ప్రతులను చింపడం, చెవుల్లో పూలు పెట్టుకుని నిరసన తెలపడం, వాకౌట్ చేయడం.. వీటన్నింటి నేపథ్యంలో తదుపరి వ్యూహంపై క్యాబినెట్ భేటీలో (Telangana Cabinet Meet) మంత్రులు శాఖలవారీగా చర్చించి అసెంబ్లీలో అనుసరించాల్సిన వైఖరిపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నది. ఆయా శాఖలకు సంబంధించిన అంశాలను విపక్ష సభ్యులు నెగెటివ్ కామెంట్స్ చేస్తే సంబంధిత శాఖల మంత్రులే దీటుగా సమాధానం ఇవ్వడంపై క్యాబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నది. బడ్జెట్‌పై చర్చల అనంతరం ఎలాగూ ఆర్థిక మంత్రిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) వివరణ ఇవ్వనున్నారు. తాజా బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన కొత్త స్కీమ్‌ల గురించి విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడంపై ఈ సమావేశంలో మంత్రులు చర్చిస్తారా?.. లేక ఆ స్కీమ్‌ల అమలుపై ప్రజల్లో విపక్షాలు ఉద్దేశపూర్వకంగా లేవనెత్తిన సందేహాలకు అసెంబ్లీ వేదికగానే వివరణ ఇస్తారా?.. ఇలాంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Read Also: ఫోన్ ట్యాపింగ్‌లో ట్విస్ట్.. విచారణకు సిద్ధమైన సీఎం

Follow Us On : WhatsApp

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>