రూ.కోట్లలో బకాయిలు.. మిల్లర్లలో గుబులు!

కలం, వరంగల్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యం మిల్లులకు చేరిన తర్వాత లెక్కల్లో చూపిన బియ్యం ఎక్కడికి వెళ్లిందని రాష్ట్ర సీఐడీ (Telangana CID) అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఏళ్ల తరబడి కస్టమ్ మిల్లింగ్ రైస్ బకాయిలు ఎందుకు పేరుకుపోయాయని ఆరా తీస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు రూ.230 కోట్ల సీఎంఆర్ బకాయిలు ఉన్నాయి. ఇప్పటివరకు రూ.50 కోట్లు మాత్రమే రికవరీ అయినట్లు సమాచారం. అరెస్టులు, ఆస్తుల జప్తు దాడులతో రైస్ మిల్లర్లలో టెన్షన్ నెలకొంది. సీఎంఆర్‌ను మిల్లర్లు గడువు ముగిసినా అప్పగించకపోవడం, బకాయిలు చెల్లించడంలో జాప్యం చేయడంతో వ్యవహారం తీవ్రతరమైంది.

ధాన్యం, బియ్యం తేడాలపైనే దృష్టి..

గత మూడేళ్ల సీజన్లకు సంబంధించిన బకాయిలపై సీఐడీ విచారణ కొనసాగిస్తున్నది. బకాయిల వసూళ్లతోపాటు రికార్డుల్లోని లెక్కలు, ధాన్యం కేటాయింపులు, బియ్యం తిరిగి ఇవ్వడం వంటి అంశాల మధ్య వ్యత్యాసాలపైనా దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. సీఎంఆర్ వ్యవహారంలో ఉమ్మడి వరంగల్ కీలకంగా ఉంది. సుమారు రూ.230 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే రూ.98 కోట్ల బకాయిలు పేరుకుపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.

వరుస అరెస్టులతో కలకలం..

ములుగు జిల్లాలో సీఎంఆర్‌కు సంబంధించి రైస్ మిల్లర్ల సంఘం మాజీ అధ్యక్షుడు బాదం ప్రవీణ్, ప్రస్తుత అధ్యక్షుడు సతీష్ అరెస్టు కావడం మిగతా మిల్లర్లలో చర్చనీయాంశమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 20 మంది అరెస్టయినట్లు సమాచారం. దర్యాప్తు ముందుకెళ్తున్న కొద్దీ మరికొందరి పాత్ర వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం మిల్లర్లలో ఆందోళన పెంచుతున్నది. సుమారు 80 మిల్లులపై రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు చేపట్టే అవకాశమున్నట్లు సమాచారం. బకాయిలు చెల్లించకుంటే ఆస్తులను జప్తు చేసి వేలం వేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. సుమారు రూ.180 కోట్ల బకాయిలు వసూలు కావాల్సి ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

లెక్కల్లో తేలాల్సిన అసలు గుట్టు..

రాష్ట్ర ప్రభుత్వ ధాన్యం కేటాయింపుల నుంచి మిల్లింగ్, బియ్యం అప్పగింత, బకాయిల చెల్లింపుల వరకు ప్రతి దశలోని రికార్డులను పరిశీలిస్తేనే అసలు పరిస్థితి స్పష్టమవుతుంది. బకాయిలు పేరుకుపోవడానికి కారణాలు, బాధ్యులెవరు, ప్రభుత్వానికి జరిగిన నష్టమెంత అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. బకాయిల వసూళ్లతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే సీఎంఆర్ వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందన్న అభిప్రాయం సంబంధిత వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>