‘క్యూర్’లో కొత్త బోర్లకు పర్మిషన్ కంపల్సరీ

కలం, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలో నీటి కొరత (Hyderabad Water Shortage) తలెత్తడంతో అపార్టుమెంట్లకు, గేటెడ్ కమ్యూనిటీలకు, హాస్టళ్లకు కొత్త చిక్కులు తెచ్చాయి. ఇప్పటికే నారాయణ విద్యా సంస్థలు దీపావళి సెలవుల పేరుతో హాస్టళ్ల విద్యార్థులను ఇళ్లకు పంపగా, ఐటీ కారిడార్లోని పలు పేయింగ్ గెస్ట్ హాస్టళ్లు నీటిని సరఫరా చేయలేమంటూ చేతులెత్తేశాయి. ప్రభుత్వ ఆంక్షలతో నీటిని సప్లై చేయలేమంటూ ప్రైవేటు ట్యాంకర్లు సేవలను నిలిపేశాయి. కొత్త బోర్లు వేయడంపై ప్రభుత్వం విధించిన ఆంక్షలతో రిగ్ ఓనర్ల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనంటూ చీఫ్ సెక్రటరీ జారీ చేసిన జీవోకు సవరణలు చేయాలని, కొన్ని సడలింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

మంత్రి ఆదేశాలతో..

మరోవైపు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల నుంచి, చెరువుల సమీపంలో బోర్ల నుంచి పదుల సంఖ్యలో ట్యాంకర్లను నింపుకుని సిటీలో విక్రయించడాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం మోటార్లను సీజ్ చేసింది. దీంతో ఆగ్రహించిన ట్యాంకర్ ఓనర్ల సంఘం సమ్మె చేసి సేవలను నిలిపేసింది. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను గమనంలోకి తీసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ పరిస్థితిని రివ్యూ చేశారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన హైడ్రా చీఫ్ రంగనాథ్ ట్యాంకర్ల యజమానులతో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేశారు.

జీవోలో కఠిన నిబంధనలు..

చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు జారీ చేసిన జీవో నెం. 259లో కొన్ని నిబంధనలు ప్రస్తావించి వచ్చే సంవత్సరం జులై వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ‘క్యూర్’ పరిధిలో ఏ అవసరం కోసం కొత్త బోర్‌వెల్ వేసుకోవాలన్నా సంబంధిత డిపార్ట్మెంటు లేదా అధికారి నుంచి అనుమతి పొందడం తప్పనిసరి అని, బోర్వెల్ వేసిన తర్వాత 15 రోజుల్లోగా రిగ్ యజమాని ఫామ్-1-ఇ ద్వారా కంప్లీషన్ సర్టిఫికెట్ను సంబంధిత అధికారికి సమర్పించాలని పేర్కొన్నారు. ఎక్కడెక్కడి నుంచి ఎక్కువ నీటిని తోడేస్తున్నారో, భారీ మొత్తంలో ఎవరు వినియోగిస్తున్నారో సంబంధిత అధికారులు జియో-రిఫరెన్స్ రిజిస్టర్ నిర్వహించాలని పేర్కొన్నారు.

సిబ్బంది ఫీల్డ్‌లో తిరుగుతూ ఎక్కడ కొత్త బోర్లు వేస్తున్నారో పరిశీలించాలని, లైసెన్స్ (పర్మిషన్) లేకుండా బోర్లు నడుస్తున్నాయో, ట్యాంకర్ ఫిల్లింగ్ జరుగుతున్నదో గమనించాలన్నారు. గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంటు ప్రతి నెలా క్యూర్ పరిధిలోని జలమట్టాల మార్పులపై రిపోర్టు తయారుచేయాలన్నారు. హైడ్రా ప్రత్యేక దృష్టి పెట్టి చెరువులు, నీటి తావుల దగ్గర బోర్‌వెల్స్, వాటర్ ఫిల్లింగ్, ఆక్రమణలు.. వీటిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

300 మీటర్ల వరకు అనుమతివ్వాలి..

ప్రభుత్వ నిబంధనలపై రిగ్ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. బోరుబావుల తవ్వకంపై నిబంధనలను సవరించాలని, సడలింపులు ఇవ్వాలని ఆ సంఘం విజ్ఞప్తి చేసింది. అదనపు రుసుములు విధించవద్దని, జరిమానాలు వసూలు చేయవద్దని, ప్రస్తుతం ఉన్న 120 మీటర్ల పరిమితిని 300 మీటర్ల లోతు వరకు తవ్వేలా మార్చాలని, జీవో 259కు సవరణలు చేయాలని కోరింది. భూగర్భ జలాలను గమనంలోకి తీసుకుని క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సడలింపులు ఇవ్వాలని కోరింది.

భవనాలు, అపార్టుమెంట్లు, విల్లాలు, లే-అవుట్లు, రోడ్లు, బ్రిడ్జిలు, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణంలో బోరుబావులు కీలక పాత్ర పోషిస్తున్నాయని, కొత్త బోర్‌వెల్స్ అంతరాయం ఏర్పడితే నిర్మాణ రంగం దెబ్బతింటుందని, దానిపై ఆధారపడిన వేలాది మంది కార్మికుల ఉపాధి కూడా ప్రశ్నార్థకమవుతుందని సంఘం అధ్యక్షుడు ముస్కు అంజిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బోరుబావులపై ప్రభుత్వం నిబంధనలు విధించేటప్పుడు తమ సంఘం ప్రతినిధులతో చర్చించాలని సూచించారు.

ప్రభుత్వం కఠిన ఆంక్షలు..

బోరుబావుల నుంచి ఎక్కువ మొత్తంలో నీటిని డ్రా చేసి ట్యాంకర్ల ద్వారా జరిగే విక్రయాలపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఎక్కువ లోతుతో బోర్లు వేయడంతో సమీప ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని, వాణిజ్య అవసరాలకు విచ్చలవిడిగా నీటిని తోడేయడం పర్యావరణానికే ప్రమాదంగా మారుతున్నదని ప్రభుత్వం పేర్కొన్నది. చెరువుల సమీపంలోనూ, శివారు ప్రాంతాల్లోనూ అలాంటి బోర్లపై దృష్టి పెట్టిన హైడ్రా మోటార్లను సీజ్ చేసింది. ట్యాంకర్ సప్లై ప్రభావితం కావడంతో యజమానులు సమ్మెకు దిగారు. దీంతో గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, భారీ అపార్టుమెంట్లు, కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్, ఆఫీసులు తదితరాలకు నీటి సప్లై ఆగిపోయింది.

ట్యాంకర్ల సమ్మె విరమణ..

హైడ్రా చీఫ్ రంగనాథ్ ట్యాంకర్ యజమానులతో చర్చలు జరిపారు. ఔటర్ రింగు రోడ్డు వెలుపల ఉన్న ‘ప్యూర్’ పరిధి నుంచి నీటిని తీసుకోవాలని చేసిన సూచనకు ట్యాంకర్ యజమానులు అంగీకరించారు. ఇప్పటివరకూ మాదాపూర్‌, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, అమీర్‌పేట, అశోక్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో నీటికి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో రవాణా భారం, ఇంధన ఖర్చులను తగ్గించుకునేందుకు సమీపంలోని బోర్ల నుంచి నీటిని సేకరిస్తున్నారు. ఇది భూగర్భ జలాలపై మరింత ప్రభావం పడుతుందని హైడ్రా చీఫ్ వివరించారు. డిమాండ్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నీటిని తోడవద్దని, ‘ప్యూర్’ నుంచి తీసుకుని సిటీలోని వాణిజ్య సంస్థలకు అంతరాయం లేకుండా సప్లై చేయాలన్న సూచనకు యజమానులు సమ్మతి తెలిపారు. రెండు రోజుల సమ్మె ముగిసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>