కలం, వరంగల్ బ్యూరో : ఆశా వర్కర్లకు రూ.18,000 వేతనం ప్రకటించి అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేశ్ డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ (Hanumakonda) రాం నగర్ లోని మంత్రి కొండా సురేఖ నివాసాన్ని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ముట్టడించారు. రామ్‌నగర్‌లోని సుందరయ్య కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన ఆశా వర్కర్లు నినాదాలు చేస్తూ మంత్రి ఇంటి వద్దకు చేరుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు మంత్రి ఇంటి వద్ద హనుమకొండ (Hanumakonda) సుబేదారు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. మంత్రి నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన సీఐటీయూ నాయకులు, ఆశాలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.
ఆశాలు సుమారు రెండు గంటలపాటు నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాగుల రమేష్ మాట్లాడుతూ ఆశాలకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్, రూ.50 వేల అంత్యక్రియల ఖర్చులు, ప్రమోషన్లు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, ప్రసూతి సెలవులు, ఆదివారం, పండగ సెలవులు కల్పించాలని కోరారు. ఎ.ఎన్.సి, పి.ఎన్.సి టార్గెట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి, సిఐటియు వరంగల్ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ మాట్లాడుతూ పెండింగ్ పారితోషికాలు, పి.ఆర్.సి ఏరియర్స్, లేప్రసి సర్వే, పల్స్ పోలియో, ఎన్నికల డ్యూటీలకు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మార్చి 28న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుంచు రాజేశ్వరి, బైరి శోభ, జనగాం శ్వేత, సిహెచ్ శ్రీవాణి, పద్మ, సిహెచ్ రాణి, రమ, కవిత, రజిత, ఈసంపల్లి శోభ, కరుణలత, లీల, పుష్ప, ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.

