కలం, నిర్మల్ : ధన త్రయోదశిని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలో నిరవధిక సమ్మె చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు (NHM Employees) శుక్రవారం దీక్షా శిబిరంలో ధన్వంతరి జయంతి (Dhanvantari Jayanti) ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా ధన్వంతరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి కృపాకటాక్షాలతో ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసేలా చూడాలని వేడుకున్నారు. గత 25 రోజులుగా ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా ఆరోగ్యశాఖలో సేవలందిస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

