కలం, వెబ్ డెస్క్: రైతులు పండించే సన్న ధాన్యానికి (Fine Rice) సంబంధించి రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏడు రకాల సన్నాలకు మాత్రమే ఇక నుంచి బోనస్ ఇవ్వబోతుంది. ఈ మేరకు సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ సమావేశ వివరాలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క వెల్లడించారు. మార్కెట్‌లో బాగా డిమాండ్ ఉన్న బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్-15048, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం-1638, డబ్ల్యూజీఎల్-44, కేఎన్‌ఎం-7715… ఈ ఏడు రకాల సన్నాలకు మాత్రమే ఇక నుంచి బోనస్ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
మొత్తం ధాన్యం తీసుకోవాల్సిందే..
రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో దేశంలోనే రికార్డు స్థాయిలో అత్యధిక ధాన్యం పండిందని కేబినెట్ అభిప్రాయపడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఇప్పటికే దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచే తక్కువ ధాన్యాన్ని సేకరించిందని ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఇక నుంచి కేంద్రం విధి విధానాల ప్రకారమే రాష్ట్రంలో పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇకపై కేంద్రం ఏయే పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించి, కొనుగోలు చేస్తుందో.. ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని తీర్మానించింది.
రామగుండం యూరియా తెలంగాణకే ఇవ్వాలి..
వానాకాలం సీజన్‌కు రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని మంత్రి వర్గం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖలు రాశారని, త్వరలోనే ఢిల్లీకి వెళ్లి మరోసారి విజ్ఞప్తి చేయాలని సూచించింది. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కంపెనీలో ఉత్పత్తి అవుతున్న యూరియాలో అత్యధిక కోటా తెలంగాణకే కేటాయించాలని డిమాండ్ చేసింది. మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు పంపించకుండా రాష్ట్రానికే ఇక్కడి యూరియాను కేటాయిస్తే రవాణా ఖర్చులు కూడా తగ్గిపోతాయని పేర్కొంది. ఎరువుల కొరత సమస్య కూడా ఉండదని, ఇదే విషయాన్ని మరోసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది.

