కలం, వెబ్ డెస్క్: తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్‌లోని (Hyderabad) ఇందిరా పార్క్ చౌరస్తాలో నిరుద్యోగుల భారీ ధర్నా (Unemployed Youth Protest) నిర్వహించారు. ఒక్కసారిగా భారీగా నిరుద్యోగులు ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 7,437 పోస్టులతో కాకుండా 19 వేల పోలీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. అలాగే పోలీస్ ఉద్యోగాల వయోపరిమితి కూడా పెంచాలని నినాదాలు చేశారు.
నోటిఫికేషన్ ఆలస్యంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ నోటిఫికేషన్లో కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని 36 సంవత్సరాలకు, ఎస్సై పోస్టులకు 38 సంవత్సరాలకు పెంచాలన్నారు. పోస్టులకు అప్లై చేసేందుకు దరఖాస్తు రుసుమును వెంటనే తగ్గించాలని నినాదాలు చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆపే ప్రసక్తే లేదని.. ప్రభుత్వం నిర్లక్యం ప్రదర్శిస్తే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు మధుసూదన్ గౌడ్, శ్రీకాంత్, వీరేష్, కరుణాకర్, శ్రీకాంత్ రాథోడ్‌తోపాటు పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొన్నారు.

