కలం, వెబ్ డెస్క్: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అధిక ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యల కారణంగా చాలా మంది తరచుగా తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ తీవ్రమైన తలనొప్పి, మైగ్రేన్ నొప్పి నరకంలా ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేయలేరు, తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. అయితే ఈ భరించలేని నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలు (Headache Relief Tips) పాటించాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మంచి నిద్ర: తలనొప్పి రావడానికి ముఖ్య కారణం సరిపడా నిద్రలేకపోవడం. అందుకే విపరీతమైన తలనొప్పి వచ్చినప్పుడు కాసేపు నిద్రపోవడం వల్ల తలనొప్పి, మైగ్రేన్ నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు నిపుణులు.
మంచి నీళ్లు: వాటర్ తక్కువగా తాగడం వల్ల కూడా తలనొప్పి వస్తుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే విపరీతమైన తలనొప్పి ఉన్నప్పుడు మంచి నీళ్లు లేదా కొబ్బరి నీళ్లు వంటి ఫ్లూయిడ్స్ తాగడం వల్ల ఉపశమనం కలుగుతుదని చెబుతున్నారు.
అల్లం టీ: తలనొప్పిని తగ్గించడంలో అల్లం టీ ప్రభావవంతంగా పనిచేస్తుందట. అల్లం టీలోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు తలనొప్పి, మైగ్రేన్ నొప్పిని తగ్గిస్తాయని చెబుతున్నారు నిపుణులు.
లవంగాల టీ: తలనొప్పిని తగ్గించడంలో లవంగాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయట. దీనికోసం నీటిలో కొన్ని లవంగాలు వేసి మరిగించి తాగాలి. ఈ టీలో ఉండే సమ్మేళనాలు తలనొప్పిని తగ్గిచండంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని చెబుతున్నారు.
పుదీనా టీ: తలనొప్పి, మైగ్రేన్ నొప్పిని తగ్గించడంలో పుదీనా టీ సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు. దీనిలోని సమ్మేళనాలు ఒత్తిడిని తగ్గించి తలనొప్పిని కొంత వరకు నివారిస్తాయి.
టీ లేదా కాఫీ: ఒక కప్పు టీ లేదా కాఫీ తాగడం వల్ల తలనొప్పి కొంత వరకు తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. వీటిలో ఉండే కెఫిన్ తలనొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుందట.
తలనొప్పిని తగ్గించే ఆహారాలు: కొన్ని రకాల పండ్లు తినడం వల్ల కూడా తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా అరటి పండ్లు, పుచ్చకాయ, బెర్రీస్, ఆప్రికాట్, అంజీరా, బాదం, అవిసె గింజలు, గుమ్మడి గింజలు వంటివి తినడం వల్ల తలనొప్పి తగ్గుతుందని చెబుతున్నారు.
కోల్డ్ కంప్రెస్: తలనొప్పి తగ్గించడంలో కోల్డ్ కంప్రెస్ చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీనికోసం కూల్ ప్యాడ్ లేదా ఐస్ క్యూబ్స్ టవల్ లో చుట్టి తలనొప్పి ఉన్న చోట కాసేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి తలనొప్పి తగ్గుతుందని చెబుతున్నారు.
(Note: ఈ సమాచారం కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటే లేదా తరచుగా ఇబ్బంది పెడితే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి.)

