కలం, వెబ్ డెస్క్ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంధనపల్లి ఫారెస్ట్ రేంజ్ (Indhanpalle Range) పరిధిలో అమానుష ఘటన వెలుగుచూసింది. వాగులో చేపల వేటకు వెళ్లారనే కారణంతో ఐదుగురు గిరిజన యువకులపై అటవీ శాఖ అధికారి ఒకరు దౌర్జన్యానికి దిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంధనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) నారాయణ సదరు యువకులను బూతులు తిడుతూ, లాఠీతో విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా, తన కాళ్లు మొక్కించుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనపై గిరిజన సంఘాలు, బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ సంరక్షణ పేరుతో అమాయక గిరిజన యువకులపై ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడటం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. గిరిజనులను హీనంగా చూస్తూ, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నారాయణపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

