గ్రౌండ్ టు డిజిటల్.. ఈసారి ప్రచారం రూటే వేరు!

కలం, తెలంగాణ బ్యూరో: ఈసారి రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఎలా ఉంటుంది?.. గత ఎన్నికల్లో చూసిన బహిరంగసభలు, జన సమీకరణ, ప్రచార రథాలు, భారీ ప్రసంగాలు, రోడ్ షో, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్.. ఇవన్నీ ఈసారి కూడా ఉంటాయా..? తగ్గుతాయా..? అనే చర్చలు మొదలయ్యాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ ఆందోళన చూసిన తర్వాత ప్రధాన పార్టీలు క్యాంపెయిన్ స్ట్రాటజీపై ఆలోచనలు మొదలయ్యాయి. గతంలోని రోడ్లమీద ఉన్న హడావుడి ఈసారి ఉండకపోవచ్చన్నది పార్టీల కేడర్ భావన.

ప్రచారంలో మేజర్ రోల్ను సోషల్ మీడియా పోషిస్తుందన్నది వారి ఉద్దేశం. ఇప్పటికే డిజిటల్ క్యాంపెయినింగ్ (Digital Campaigning)లో బీఆర్ఎస్, బీజేపీ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. కాంగ్రెస్ సోషల్ యాక్టివిటీస్ ఇంకా మొదలుకాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పక్కా వ్యూహాన్ని, వార్ రూమ్‌ను పెట్టుకుని హడావుడి చేసినప్పటికీ ఈసారి సైలెంట్‌గానే ఉన్నది. ఎన్నికలకు రెండేండ్ల టైమ్ ఉందన్న ఆలోచన కూడా ఆ పార్టీ మౌనానికి కారణమని తెలుస్తున్నది. అయితే.. త్వరలోనే కాంగ్రెస్ కూడా డిజిటల్ క్యాంపెయిన్ను మొదలుపెట్టే చాన్స్ కనిపిస్తున్నది. దీంతో మూడు ప్రధాన పార్టీల డిజిటల్ దండయాత్ర రాష్ట్రంలో హోరెత్తనుంది. రీల్స్, షార్ట్ వీడియోస్, మీమ్స్తో మన స్మార్ట్ ఫోన్‌ను ముంచెత్తనుంది.

దేశరాజధానిలో జెన్ జీ యువత చేపట్టిన ఉద్యమాన్ని చూసి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు తమ క్యాంపెయిన్ స్టైల్కు సరికొత్త పదును పెడుతున్నాయి. ఇన్నాళ్లూ కార్యకర్తలను వెంటేసుకొని, బ్యానర్లు పట్టుకొని జనాల్లోకి వెళ్లి ఉపన్యాసాలు దంచిన నాయకులు.. ఆ ఆనవాయితీని పక్కనబెట్టి సోషల్ మీడియా ద్వారా ఓటర్లను ఆకట్టుకోవాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ప్లానింగ్లో బీఆర్ఎస్, బీజేపీ ముందు వరుసలో ఉండగా.. అధికార పార్టీ కాంగ్రెస్ మాత్రం వెనుకబడి ఉంది.

గతంలో వాడినప్పటికీ..!

గత అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియాను పార్టీలు వాడినప్పటికీ ఈసారి సరళి మారింది. ఉదయం చేసిన వ్యాఖ్యకు నిమిషాల్లోనే వీడియో క్లిప్ రెడీ చేసి జనంలోకి వదులుతున్నాయి. మరికొన్ని నిమిషాల్లో ఆ అంశంపై మీమ్‌ వచ్చేస్తున్నది. ఇంకాసేపటికి రీల్, షార్ట్ వీడియో తయారవుతున్నది. ఇవన్నీ వాట్సాప్, సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి.

కాస్త ఆలస్యంగానో, మరుసటి రోజుకో ప్రత్యర్థి పార్టీ నుంచి కౌంటర్ వస్తున్నది. పొలిటికల్ కామెంట్స్, విమర్శలు సోషల్ మీడియాలోనే మొదలై అక్కడే ముగుస్తున్నాయి. దీనికి అదనంగా అప్పుడు-ఇప్పుడు అనే తరహాలో ఒక నేత గతంలో చేసిన కామెంట్లను, ఇప్పుడు దానికి విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలను జోడించి ఇచ్చే వీడియోలు జనాల్లోకి బాగా వెళ్తున్నాయి.

ట్రెండింగ్ టాపిక్స్ పసిగట్టే పనిలో యూత్

రాజకీయ పార్టీల డిజిటల్ టీమ్స్ కేవలం పోస్టులు పెట్టడానికే పరిమితం కాకుండా ట్రెండింగ్ టాపిక్ పట్టుకుంటున్నాయి. ఏ కామెంట్‌కు ఎక్కువ స్పందన వస్తున్నది? ఏ వీడియో ఎక్కువగా షేర్ అవుతున్నది? ప్రత్యర్థి పార్టీ ఏ అంశాన్ని ఎత్తుకుంటున్నది?.. ఇలాంటి అంశాలను పార్టీల సోషల్ మీడియా సెల్స్ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.

దానికి తగ్గట్టు కంటెంట్‌ను రూపొందించే వ్యవస్థలను బీజేపీ, బీఆర్ఎస్ సృష్టించుకున్నాయి. మానిటరింగ్, కంటెంట్ క్రియేషన్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్, పోస్టింగ్, రీచ్ అబ్జర్వేషన్, ప్రత్యర్థి కౌంటర్.. ఇవన్నీ నిరంతర ప్రక్రియగా సాగుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ నిర్దిష్టమైన డిజిటల్ పొలిటికల్ స్ట్రాటజీపై ఫోకస్ పెట్టాయి. ఈ పార్టీలు వాటికంటూ ప్రత్యేక ‘నెరేటివ్‌’ రూపొందించుకున్నాయి.

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పక్కా వ్యూహాన్ని, వార్ రూమ్‌ను పెట్టుకుని హడావుడి చేసిన కాంగ్రెస్ పార్టీ ఈసారి సైలెంట్‌గానే ఉన్నది. సోషల్ మీడియా పోస్టింగ్ చేస్తున్న కేడర్, అభిమానులను ‘వారియర్స్’ అని గొప్పగా చెప్పుకున్నది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సైతం ‘సోషల్ వారియర్స్’తో సమావేశమై కృతజ్ఞతలు తెలిపారు.

అయితే.. త్వరలోనే కాంగ్రెస్ ‘వారియర్స్’ కూడా డిజిటల్ క్యాంపెయిన్కు సిద్ధమవనున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ సంక్షేమ – అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలు, ప్రజలకు కలిగిన లబ్ధి.. ఇలాంటివన్నీ కాంగ్రెస్ రూపొందిస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలను టేకప్ చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ సోషల్ వింగ్‌లు కౌంటర్ నెరేటివ్‌ను ప్లాన్ చేస్తున్నాయి.

ఎక్స్, ఇన్‌స్టా, యూట్యూబ్‌, ఏఐ

ప్రతి సోషల్ మీడియా వేదికకు రాజకీయ ప్రచారంలో ప్రత్యేక పాత్ర. ఎక్స్లో తక్షణ రాజకీయ స్పందనలు, కౌంటర్లు, హ్యాష్‌ట్యాగ్ ప్రచారం ఉంటున్నది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్ వీడియోలు, విజువల్ కంటెంట్‌ యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్నది. గతంలో సర్వే సంస్థలతో కాంట్రాక్టు, అవి అందించే వ్యూహాలు, దానికి తగినట్లు గ్రామాల్లో టీమ్‌లు, ఇంటింటికీ తిరిగి నాడి పసిగట్టడం, ఆ రిపోర్ట్కు తగినట్లుగా పార్టీ శ్రేణుల్ని గ్రామ స్థాయిలో ప్రచారానికి పంపడం.. ఇవన్నీ జరిగేవి.

కానీ ఇప్పుడు చెప్పదల్చుకున్న విషయాన్ని, రాజకీయ ప్రత్యర్థులపై చేయాల్సిన విమర్శలను వీడియో తీసి రీల్స్ తరహాలో ఇన్‌స్టాగ్రామ్‌లో, షార్ట్ వీడియో పేరుతో యూట్యూబ్‌లో పోస్ట్ చేయడంపై ఫోకస్ పెరిగింది. ఇలా పోస్ట్ చేసే సోషల్ మీడియా విభాగంలోని వ్యక్తులకు ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా సమాచారాన్ని పంపుతున్నారు. ఇక మీమ్స్, పోస్టర్లు కూడా డిజిటల్ వేదికల మీదనే. కొత్తగా మీమ్స్ ఫీచర్‌ను కూడా పార్టీలు వాడుకుంటున్నాయి. ఎక్కువగా ప్రత్యర్థులను విమర్శించడానికే మీమ్స్ వాడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి పోస్టర్లు కూడా ప్రత్యక్షమవుతున్నాయి.

ఆ స్టైల్ ఓట్లు రాలుస్తుందా?

సోషల్ మీడియా ద్వారా ప్రచారం ఓటర్లను ఆకర్షించగలదా? ఓట్లను రాలుస్తుందా?.. అనే అనుమానాలూ పార్టీల శ్రేణుల్లో లేకపోలేదు. సోషల్ మీడియా పోస్ట్ మాత్రమే ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించకపోవచ్చుగానీ ఒక అంశంపై ప్రజల్లో చర్చను పెంచగలదని, పార్టీపై ఉన్న అభిప్రాయాన్ని ప్రభావితం చేయగలదని, యువతలో రాజకీయ ఆసక్తిని రేకెత్తించగలదని, నాయకుడి ఇమేజ్‌ను హైప్ చేయగలదని, ప్రత్యర్థులను పొలిటికల్‌గా డ్యామేజ్ చేయగలదని ఆ పార్టీల సోషల్ మీడియా ప్రతినిధులు భావిస్తున్నారు.

అందుకే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పోటీ కేవలం గ్రౌండ్‌లో ఎవరి కేడర్ బలంగా ఉందన్నదనే అంశంపైకాక డిజిటల్‌లో ఎవరి నెరేటివ్ బలంగా ఉంది అనేదాని చుట్టూ సాగుతున్నది. సభలు, సమావేశాలతో పాటు మొబైల్ స్క్రీన్‌పై జరిగే ఈ రాజకీయ పోరు రాబోయే రోజుల్లో మరింత ఉధృతమయ్యే అవకాశాలున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>