‘సర్’ ముగిశాకే ఎన్నికల సమరం!

కలం, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ సహా రాష్ట్రంలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లకు, పరిషత్‌లకు ఎన్నికలు (Telangana Elections) నిర్వహణపై ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘సర్’ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాకే ఎలక్షన్స్ పెట్టాలని భావిస్తున్నది. విధానపరమైన నిర్ణయం తీసుకోకపోయినా అప్పటివరకూ ఎన్నికలు జరపవద్దనే అభిప్రాయంతో ఉన్నది.

ప్రస్తుతం జరుగుతున్న ‘సర్’ ఎన్యూమరేషన్ ఫారాల దరఖాస్తు గడువు ఈ నెల 10వ తేదీతో ముగుస్తున్నా.. ఓటర్ల తుది జాబితా అక్టోబర్ 10న విడుదల అవుతుంది. అప్పటికి రాష్ట్రంలోని నియోజకవర్గాలవారీగా ఓటర్ల వివరాలు వెల్లడి అవుతాయి. ప్రస్తుతం ‘సర్’ ప్రక్రియ జరుగుతున్నందున అటు పాత జాబితా అందుబాటులో లేకపోవడం, కొత్త జాబితా రూపుదిద్దుకోకపోవడంతో ఓటర్ లిస్టుపై సస్పెన్స్ నెలకొన్నది. పూర్తి స్థాయి జాబితా విడుదలైన తర్వాత ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. అప్పటివరకు ఎలాంటి ఎన్నికలు ఉండవన్నది ప్రభుత్వవర్గాల సమాచారం.

జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు

రాష్ట్రంలో ఇప్పటికే పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్నికలు జరిగినా జీహెచ్ఎంసీ, ఖమ్మం, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లకు జరగలేదు. జీహెచ్ఎంసీని ప్రభుత్వం మూడుగా విభజించింది. దీనిపై కొన్ని లీగల్ చిక్కులు నెలకొనడం, మరోవైపు సెన్సస్ ప్రక్రియ కారణంగా బౌండరీలను సీజ్ చేయడంతో ఇన్నాళ్లూ అక్కడ ఎన్నికలు జరపలేకపోయింది. ఇప్పటికీ హైకోర్టు వివాదంపై క్లారిటీ లేకపోవడంతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనున్నది.

పాత జీహెచ్ఎంసీని ప్రభుత్వం జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా డివైడ్ చేసింది. పరిపాలనాపరంగా ఆ పద్ధతిలోనే రోజువారీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మూడు కార్పొరేషన్లకూ వేర్వేరు మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు. పాత జీహెచ్ఎంసీ గడువు తీరిపోవడంతో ఎన్నికలు జరపాల్సి ఉన్నది. కానీ, మూడు భాగాలు అయినందున లీగల్ చిక్కులను దాటుకొని నిర్వహించడం ప్రభుత్వం ముందున్న సవాల్.

మండల, జిల్లా పరిషత్‌లకూ ‘సర్’ చిక్కులు

రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల ప్రజాపరిషత్‌లకు సైతం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎలెక్టెడ్ బాడీలు లేకపోవడంతో కేంద్ర ఆర్థిక సంఘం నిధులు సైతం వీటికి ఆగిపోయాయి. వీలైనంత తొందరగా నిర్వహించాలని భావించినా గతంలో సెన్సస్ ప్రక్రియ, ఇప్పుడు ‘సర్’ ప్రక్రియ బ్రేకులు వేశాయి. ఫైనల్ ఓటర్ లిస్టు రిలీజ్ అయిన తర్వాతనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

ప్రభుత్వం సైతం ఇప్పటికిప్పుడు హడావుడిగా నిర్వహించాలని భావించడంలేదు. ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ సందర్భంగా ఎన్నికల నిర్వహణపై సంకేతాలిచ్చారు. ఏ ఎన్నికలైనా ‘సర్’ ముగిసిన తర్వాతనే అని పేర్కొన్నారు. ఫైనల్ ఓటర్ లిస్టు అక్టోబర్ 19న విడుదల కానున్నందున నవంబర్ వరకూ ఎన్నికలు జరిగే అవకాశం లేదనే స్పష్టత వచ్చినట్లయింది.

ఎన్నికలు జరగాల్సినవి..!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC). ఇటీవలే పాత జీహెచ్ఎంసీని ప్రభుత్వం జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా డివైడ్ చేసింది. దీనిపై లీగల్ చిక్కులు నెలకొన్నాయి.
ఖమ్మం, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లు. వీటి పాలక మండలి గడువు మే నెలలోనే తీరిపోయింది. ఎన్నికలు లేకపోవడంతో పరిపాలన గాడితప్పిందన్న ఆరోపణలు వస్తున్నాయి.
రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల ప్రజాపరిషత్‌లకు సైతం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎలెక్టెడ్ బాడీలు లేకపోవడంతో కేంద్ర ఆర్థిక సంఘం నిధులు సైతం వీటికి ఆగిపోయాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>