కలం, నల్లగొండ బ్యూరో : పత్తి సాగుకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మెట్టభూములు పంటల మార్పుతో తలకిందులైంది. తెల్ల బంగారంగా పిలిచే పత్తి సాగు ఏటేటా తగ్గుతుండగా, పసిడి ధాన్యంగా పిలిచే వరి సాగు రికార్డులను నమోదు చేస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గడిచిన ఆరేండ్లలో వ్యవసాయ శాఖ (Nalgonda Agriculture) లెక్కలను పరిశీలిస్తే.. పత్తి సాగు పావు వంతుకుపైగా పడిపోయింది. ఆ స్థానాన్ని వరి వేగంగా భర్తీ చేసింది.
సాగునీటి ప్రాజెక్టుల విస్తరణ, భూగర్భ జలాలు పెరగడం ఒక కారణమైతే.. పత్తికి ఎకరాకు రూ.35 వేలకుపైగా పెట్టుబడి, చీడపీడల దాడి, కూలీల కొరత రైతులను పత్తి సాగుకు దూరం చేశాయి. మరోవైపు వరి నాట్లు, కోతల్లో యంత్రాల వాడకం పెరగడం, గ్రామాల్లోనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉండడంతో రైతులు వరి వైపే మొగ్గు చూపారు. ప్రస్తుత 2026 వానాకాలం సీజన్ లో నల్లగొండ జిల్లాలో 5.55 లక్షల ఎకరాలు, సూర్యాపేటలో 2.30 లక్షలు, యాదాద్రి జిల్లాలో 1.90 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అయితే వర్షాలు ముఖం చాటేయడంతో పత్తి చేలు ఆకుల దశలోనే వాడిపోతుండగా.. రిస్క్ తీసుకోలేమని రైతులు బోర్లు, బావుల కింద వరి నాట్లు వేసేందుకే రెడీ అయ్యారు.
పత్తి సాగు పతనానికి కారణాలేంటి?
2020లో ఎకరానికి పత్తి సాగు ఖర్చు రూ. 20వేల లోపు ఉంటే.. నేడు ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు పెరిగి రూ. 35వేలు దాటింది. అయితే గులాబీ రంగు పురుగు పోటుతో దిగుబడి 10 క్వింటాళ్ల నుంచి 4-5 క్వింటాళ్లకు పడిపోయింది. పత్తి ఏరేందుకు కూలీలు దొరకడం కష్టంగా మారింది. కాయ దశలో వచ్చే వర్షాలు, మద్దతు ధర దక్కకపోవడం, తేమ శాతం పేరిట ఐకేపీ సెంటర్లలో కోతలు పత్తి రైతులను ఆర్థికంగా దెబ్బతీయడమే పత్తి సాగు తగ్గుదలకు కారణాలుగా ఉన్నాయి.
వరి వైపే చూపు..
సాగర్ ఎడమ కాల్వతో పాటు కాళేశ్వరం కాల్వల, మూసి, డిండి, ఉదయసముద్రం ఎత్తిపోతల ద్వారా చెరువులు నిండటంతో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి. దీంతో మెట్ట భూముల్లోనూ రైతులు బోర్ల వేసి వరి సాగు చేస్తున్నారు. పత్తితో పోలిస్తే శ్రమ తక్కువగా ఉండటంతో రైతులకు కలిసి వచ్చింది. దీంతో వరి సాగు సురక్షితమైన మార్గంగా మారింది.
ఉమ్మడి జిల్లాలో నీటి సౌకర్యం పెరగడం శుభపరిణామమే అయినా, పత్తి విస్తీర్ణం ఊహించని రీతిలో తగ్గడం, అందరూ వరి వైపే మొగ్గుచూపడంతో భవిష్యత్తులో నేల సారం తగ్గి భూగర్భ జలాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. పత్తిలో మెరుగైన విత్తన రకాలు, యాంత్రికీకరణను ప్రోత్సహించి మళ్లీ పంటల వైవిధ్యం తెచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆరేండ్లలో సాగు తీరు ఇలా..
ఖరీఫ్ సంవత్సరం పత్తి (లక్షల ఎకరాల్లో) వరి (లక్షల ఎకరాల్లో)
2020 12.00 8.70
2021 11.50 9.50
2022 10.95 10.55
2023 10.20 11.40
2024 9.80 10.65
2025 9.70 9.95
2026 (ప్రస్తుతం) 9.55 10.20

