కలం, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి రాష్ట్రంలో ఉనికిలోకి వచ్చిన వైద్య విధాన పరిషత్ వ్యవస్థ (TVVP) స్థానంలో కొత్తదానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ పేరుతో కొత్త వ్యవస్థ ఉనికిలోకి రానున్నది. సీఎం అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ (Telangana Cabinet) సమావేశం దీనిపై చర్చించి ఆమోదం తెలిపింది. మరికొన్ని గంటల్లో అధికారికంగా ప్రభుత్వం వెల్లడించనున్నది. వైద్య విధాన పరిషత్ స్థానంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ ఉనికిలోకి వచ్చినా అడ్మినిస్ట్రేషన్‌పరంగా మార్పులు జరిగినా ప్రజలకు వైద్య సేవలందించే మెకానిజం యధావిధిగా కొనసాగనున్నది. కొత్త వ్యవస్థ ద్వారా తలెత్తే మార్పులపై త్వరలోనే వైద్యారోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను విడుదల చేయనున్నది. కొత్త వ్యవస్థ రాకతో ఉద్యోగులంతా ప్రభుత్వ పరిధిలోకి వస్తారు. జీతభత్యాలు సకాలంలో అందుతాయన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక స్వయం ప్రతిపత్తి సంస్థగా పనిచేస్తున్న టీవీవీపీ ఇక నుంచి ప్రభుత్వ అంగంగా ఆవిర్భవించనున్నది.
సెకండరీ హెల్త్ కేర్ సేవల్లో TVVP :
రాష్ట్రంలో జిల్లా, మండల, గ్రామ స్థాయిలో సెకండరీ హెల్త్ కేర్ సర్వీసులను అందించాలన్నది వైద్య విధాన పరిషత్ ప్రధాన ఉద్దేశం. జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పేరుతో ఇవి నడుస్తాయి. కనీసంగా 30 పడకల నుంచి గరిష్టంగా 350 బెడ్స్ వరకు ఈ ఆస్పత్రుల్లో ఉంటాయి. దానికి తగినట్లు మౌలిక సదుపాయాలూ ఉంటాయి. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, అడ్మినిస్ట్రేట్ స్టాఫ్ తదితర కేటగిరీల్లో సుమారు నాలుగు వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి తోడు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, మీన్ టైమ్ స్కేల్ పేర్లతో సుమారు రెండున్నర వేల మంది సిబ్బంది కూడా విధుల్లో ఉన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రాథమిక రోగ్య కేంద్రాల్లో వైద్య చికిత్స సాధ్యం కానప్పుడు వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రులకు వైద్యులు రిఫర్ చేస్తారు. వారికి ట్రీట్‌మెంట్ అందించే బాధ్యత టీవీవీపీ చూసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్-ఇన్-ఎయిడ్ ద్వారా నిధులు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నిధులు సమకూరుతాయి. ఈ నిధులను తల్లీ బిడ్డల సంరక్షణ, ఔషధాల కొనుగోలు, టీకాల పంపిణీకి టీవీవీపీ వినియోగిస్తుంది.
View this post on Instagram
Read Also: సీఎం క్యాంప్ ఆఫీస్‌కు హై సెక్యూరిటీ.. ఆ వాల్ కోసం రూ. 9 కోట్ల ప్రాజెక్టు!
Follow Us On : WhatsApp


