కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లాలో (Nizamabad Paddy Farmers) చేతికి వచ్చిన పంటను అమ్ముకునేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు. పొద్దున్నే వచ్చి ధాన్యం ఎండబెడుతున్నారు. తేమ శాతం చూసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కుటుంబాలతో వచ్చి రోడ్డు పక్కనే రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. అక్కడే భోజనాలు చేస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో ఉంటున్నారు. వడ్లను ఆరబెట్టే రైతులది ఇదే తంతుగా ఉంది.
నిజామాబాద్ – ఆర్మూర్ – కరీంనగర్ రహదారిపై ధాన్యం కుప్పలే దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక , ప్రైవేట్ వ్యాపారులు రూ. 2500 ధర చెల్లిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతకో అంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. ప్రైవేటు వ్యాపారులు కూడా కొనేందుకు సరిగా రావడంలేదని, తమ పరిస్థితి ఏంటోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధర ఎంతంటే అంతే..
నిజామాబాద్ జిల్లాలో చాలా చోట్ల ప్రైవేట్ వ్యాపారుల దందా కొనసాగుతున్నది. మొన్నటి వరకూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ, వర్ని బోధన్, నిజామాబాద్ రూరల్ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల వ్యాపారుల వచ్చి ధాన్యం కొనుగోలు చేశారు. క్వింటాలుకు రూ. 3,800– 4, 000 చెల్లించారు. ఇప్పుడు వాళ్ల కొనుగోలు తగ్గిపోయింది. లోకల్ వ్యాపారుల దందా పెరిగింది. సిండికేట్ గా మారి ధరలు తగ్గించేశారని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు.
ధర తగ్గించేశారని ఆందోళన
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో స్థానిక దళారుల చేతుల్లో రైతులు మోసపోతున్నారు. బయట నుంచి దళారులు రాకుండా అడ్డుకుంటున్నారు. లోకల్ దళారులే ఇస్టానుసారంగా తక్కువ ధరకు వరి ధాన్యం కొంటున్నారని రైతులు నిరసన తెలిపారు. బయట దళారులు క్వింటా రూ. 3,400 ఇస్తే, స్థానిక దళారులు రూ. 2900 కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి లోకల్ దళారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
బోనస్ చెల్లించకుండా సర్కార్ కుట్ర
స్థానిక వ్యాపారులు సిండికేట్ అయి రైతులకు నష్టం చేసే రైస్ మిల్ యజమానులపై చర్య తీసుకోవాలని ఏఐయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు, వి. ప్రభాకర్, కార్యదర్శి బి. దేవారం డిమాండ్ చేశారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ లో వారు మీడియాతో మాట్లాడారు. గతేడాది ఇదే సీజన్లో 70. 82 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేసి రూ. 16.66 కోట్లను మద్దతు ధరగా ప్రభుత్వం రైతులకు చెల్లించింది. మరో రూ. 14.25 కోట్లను బోనస్ గా చెల్లించింది. ఇప్పుడు ఎల్ నినో ప్రభావం చూపుతూ.. ఈ సీజన్ లో సరిగా ధాన్యం కొనుగోలు చేయకుండా బోనస్ ను రైతులకు ఎగనామం పెట్టడానికి రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర పన్నిందని ఆరోపించారు. రైస్ మిల్ యజమానులు, వ్యాపారులు కోతల ప్రారంభంలో కల్లాల వద్దనే పచ్చి ధాన్యాన్ని రూ. 3,800 – రూ. 4,000 చొప్పున కొనుగోలు చేశారు. సిండికేట్ గా మారి కృత్రిమంగా ధర తగ్గించి రూ. 2,500 – రూ. 3,000లోపు ధర తగ్గించి రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు నామమాత్రంగా కొబ్బరికాయ కొట్టేవరకే పరిమితం చేశారని మండిపడ్డారు.
రైతుల ఆవేదన.. వారి మాటల్లోనే:
పదేహేను రోజులుగా రోడ్డుపైనే..
”వడ్లు రోడ్డు మీదకు తెచ్చి పదేహేను రోజులవుతున్నది. ఇంతవరకూ ప్రభుత్వ కేంద్రాల నుంచి కొనే నాథుడే రాలేదు. ప్రైవేటు వ్యాపారులు కూడా రావడం లేదు. ధరలు తగ్గించాక చివరికి మా వద్ద కాంటాలు వేసే పరిస్థితి ఉంది. వానలు లేక పంటల దిగుబడి తగ్గిపోగా.. ఇప్పుడు ధరలు లేక అన్నిరకాలుగా నష్టపోతున్నాం” అని నిజామాబాద్ జిల్లా గుత్పకు చెందిన అనూష అనే మహిళా రైతు వాపోయారు.
రాత్రింబవళ్లు ఇక్కడే
”వడ్లు రోడ్డుపై పోసి వారం అవుతున్నది. కొనే వారు లేరు. ఊర్లో ధాన్యం ఆరబెట్టేందుకు స్థలం లేదు. అందుకే రోడ్డుపైనే ఎండబెడుతున్నాం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ధరలు కూడా తగ్గించేశారు. రాత్రింబవళ్లు ఇక్కడే ఉంటూ అమ్ముకోవడానికి కూడా కష్టాలు పడుతున్నాం” అని రామచంద్రపల్లి తండాకు చెందిన రవి అని రైతు చెప్పుకొచ్చారు.
అమ్ముకునేందుకు బతిమిలాడుతున్నాం
”ధాన్యం అమ్ముకోవడానికి కూడా బతిమిలాడాల్సి వస్తున్నది. వడ్లలో రోడ్డుపై ఆరబోసి 3 రోజులు దాటింది. ప్రభుత్వం నుంచి ఎవరూ పట్టించుకోనేవారు లేరు. ఈసారి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. లారీలు లేవు. ప్రైవేటు వ్యాపారులను ఎంతకో అంతకు ఇచ్చేస్తున్నాం” అని గుత్ప తండాకు చెందిన కిషన్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

