ఎల్‌ నినో ఎఫెక్ట్.. వరి వద్దంటున్న రైతులు!

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా యాసంగి (రబీ) సీజన్ సాగు (Rabi Cultivation) పనులు మొదలయ్యాయి. ఒకవైపు ఖరీఫ్ (వానాకాలం) పంటల విక్రయాలు జరుగుతున్నా మరోవైపు ఆ ప్రక్రియ పూర్తయిన జిల్లాల్లో సాగుపనులు ప్రారంభమయ్యాయి. ఎల్‌ నినో పరిస్థితులతో ఖరీఫ్ సీజన్‌లోనే రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడంతో రబీ సీజన్‌లో జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వం సూచించినట్లుగానే వరి సాగును తగ్గించుకున్నారు. ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగుచేసే జొన్న, మొక్కజొన్న, కంది, శనగ, వేరుశనగ తదితర పంటలవైపు మొగ్గు చూపుతున్నారు.

రాష్ట్రంలో మరే జిల్లాకంటే ముందుగా సాగు పనులు మొదలయ్యే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ ఈసారి వరి పంటకు బదులుగా జొన్న, మొక్కజొన్నకు రైతులు మొగ్గుచూపారు. ఆ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులున్నా, కొంత నీరు అందుతుందనే నమ్మకమున్నా వరికి బదులుగా ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం విశేషం. యాసంగి సీజన్‌లో (Rabi Cultivation) ఈసారి (నవంబర్​ 18 నాటికి) రాష్ట్రంలో మొత్తం 2.38 లక్షల ఎకరాల్లో సాగుపనులు మొదలైతే అందులో కేవలం 96 ఎకరాలకే వరి పరిమితమైంది.

ఆరుతడి సాగువైపు రైతాంగం

గతంలో ఎన్నడూ లేని తీరులో ఈసారి ఎల్‌ నినో పరిస్థితులు, వర్షాలు లేకపోవడం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటిపోవడం, తాగడానికి సైతం నీటికి ఇబ్బందులు రావడంతో రైతాంగం తక్కువ నీటితో పండే పంటలనే సాగులోకి తెస్తున్నారు. వరి దిగుబడిలో దేశంలోనే రెండో స్థానంలో ఉండే రికార్డు ఎలా ఉన్నా ప్రస్తుత వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో మాత్రం పెట్టిన పెట్టుబడి వృధా కావొద్దన్న ఉద్దేశంతో ఆరుతడి పంటలు, పప్పుధాన్యాలపైనే ఆశలు పెట్టుకున్నారు.

వరి పంటకు ప్రత్యేక గుర్తింపు ఉన్న నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో రైతులు ఆ పంట సాగుకు ససేమిరా అంటున్నారు. ఆల్టర్నేట్‌గా కందులు, పెసలు, మినుములు, శనగలు, వేరుశనగల పంటల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. గతేడాదితో పోలిస్తే తొలి 2 వారాల్లోనే వేరుశనగ సాగు పెరుగుతున్నది. వచ్చే సంవత్సరం జులై వరకు నీటికి కష్టాలు తప్పవన్న ప్రభుత్వ హెచ్చరికలు, వ్యవసాయ శాఖ సూచనలతో రైతులు వరి సాగు జోలికి వెళ్లడం లేదు.

రబీ సాగు ఇలా.. (ఎకరాల్లో)

ఇప్పటిదాకా మొదలైన సాగు: 2,38,323
ఇందులో వరి: కేవలం 96
వేరుశనగ: 70,967
కందులు: 49,772
మొక్కజొన్న: 45,546
జొన్నలు: 21,057
మినుములు: 13,076
పెసలు : 4,493

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>