తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఫిబ్రవరి నెల టికెట్లు వచ్చేశాయ్!

కలం, వెబ్ డెస్క్ : తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం టీటీడీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించిన వివిధ దర్శన టికెట్ల ఆన్‌లైన్ కోటాను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లను రిలీజ్ చేసింది. అలాగే నేడు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది.

భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ (ttdevasthanams.ap.gov.in) ద్వారా మాత్రమే ఈ టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇదిలాఉంటే సామాన్య భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు (మంగళవారం) ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

మరోవైపు నేడు తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఎటువంటి దర్శన టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం పూర్తి కావడానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని మొత్తం 81,516 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో 25,547 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీకి రూ.3.81 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>