రియల్ ఎస్టేట్‌పై విమర్శలకు చెక్.. గ్రౌండ్ రియాలిటీ ఇదే!

కలం, తెలంగాణ బ్యూరో : రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ (Hyderabad Realty) దూసుకుపోతున్నది. గతేడాదితో పోలిస్తే ఇండ్లు, భవనాల విక్రయం మందగించినా.. దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే ముందంజలోనే ఉన్నది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 60 మి.చ.అ. మేర ల్యాండ్ విక్రయాలతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

విక్రయించిన భూముల విలువ ప్రకారం చూస్తే బెంగళూరు, ముంబై నగరాల తర్వాత మూడో స్థానంలో నిలవగా.. అమ్ముడైన ఇండ్లు, ఆఫీస్ బిల్డింగ్‌ల సంఖ్య ప్రకారం చూస్తే పుణె, బెంగళూరు, థానె తర్వాత నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మేరకు క్రెడాయ్, సీఆర్ఈ మాట్రిక్స్ సంస్థలు సంయుక్తంగా విశ్లేషించి విడుదల చేసిన రిపోర్టులో వెల్లడైంది.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని, నిర్మాణాలు మందగించాయని, హైడ్రా భయంతో సేల్స్ దెబ్బతిన్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కానీ గ్రౌండ్ రియాలిటీ మరోలా ఉందంటూ తాజా రిపోర్టులోని అంశాలు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌కు ఫుల్ డిమాండ్ ఉన్నదని, నగర శివారు ప్రాంతాల్లోని భూముల ధరలు ఊహించనంతగా పెరిగాయని నివేదిక వెల్లడించింది.

సిటీలో ఐటీ కంపెనీలు, వివిధ రకాల ఆఫీస్ అవసరాలకు కో-వర్కింగ్ స్పేస్‌కు డిమాండ్ పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఆఫీస్ స్పేస్ డిమాండ్ దాదాపు 17% పెరిగింది. మొత్తం డిమాండ్‌లో ఐటీ కంపెనీల నుంచి 38%, కో-వర్కింగ్ ఆఫీసుల నుంచి 27% కనిపిస్తున్నది.

తక్షణం 6.8 మిలియన్ చ.అ ఆఫీస్ స్పేస్ కావాలనే డిమాండ్ నెలకొంటే.. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నందున 1.20 మి.చ.అ. మేర మాత్రమే సప్లై చేసే పరిస్థితి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. సుమారు 82.4 మి.చ.అ. మేర నిర్మాణంలో ఉన్నదని, ఇది పూర్తికావడానికి సుమారు 29 నెలలు పట్టవచ్చని అంచనా వేసింది. ఎక్కువగా ఒక లక్ష చ.అ. స్థలం కోసం డిమాండ్ ఉన్నదని, మొత్తం డిమాండ్‌లో ఇది దాదాపు 58% అని పేర్కొన్నది.

మిగిలిన డిమాండ్‌లో 50 వేల చ.అ. కంటే ఎక్కువ స్పేస్ కోసం 16%, 50 వేల చ.అ. లోపు స్థలం కోసం 17% ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం రెంట్/లీజ్ మార్కెట్‌లో యావరేజ్‌గా ఒక్కో చ.అ.కు నెలకు రూ.73.8 చొప్పున డీల్ కుదురుతున్నట్లు వివరించింది.

హౌసింగ్ సేల్స్ రూ.53 వేల కోట్లు

ఈ సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఇండ్ల విక్రయాల్లో విలువ పరంగా దేశంలోనే థర్డ్ ప్లేస్‌లో ఉన్న హైదరాబాద్.. దాదాపు రూ.52,900 కోట్ల మేర సేల్స్‌తో రికార్డు సృష్టించింది. ఇండ్ల సంఖ్య రీత్యా చూస్తే గతేడాదితో పోలిస్తే దాదాపు 13% సేల్స్ డౌన్ అయ్యాయి. ఈ ఆరు నెలల్లో 26,068 ఇండ్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఒక్కో ఇంటి యావరేజ్ రేట్ రూ.1.85 కోట్లుగా ఉంటే.. ఈ సంవత్సరం అది రూ.2.03 కోట్లకు పెరిగింది.

ఈ సంవత్సరం కొత్తగా 49,656 యూనిట్ల నిర్మాణం ప్రారంభమైంది. గతేడాదికంటే ఇది దాదాపు 37% ఎక్కువ. ఇప్పటికే నిర్మాణమైన యూనిట్లు సేల్ కాకుండా ‘అన్‌సోల్డ్’ కేటగిరీలో దాదాపు 1,42,722 ఉన్నాయి. గతేడాది కంటే ఇది 21% పెరిగింది. ఇవన్నీ పూర్తిగా అమ్ముడుపోవాలంటే దాదాపు 29 నెలల సమయం పడుతుందని అంచనా. ఇందులో దాదాపు 80% యూనిట్లు ఈ ఏడాది చివరకు లేదా వచ్చే ఏడాది ప్రారంభం నాటికి పూర్తికావచ్చని, మిగిలిన 20% కాస్త సమయం తీసుకుంటాయని నివేదికలో తేలింది.

ఇదీ లెక్క

= విక్రయించిన మొత్తం విస్తీర్ణం: 60 మి.చ.అ
= అమ్ముడైన ఇండ్లు: 26,068
= వీటి విలువ: రూ.52,900 కోట్లు
= ఒక్కో యూనిట్ వాల్యూ: రూ.2.03 కోట్లు
= కొత్తగా ప్రారంభమైన నిర్మాణాలు: 49,656 యూనిట్లు
= గతేడాదితో పోలిస్తే పెరిగిన ఆఫీస్ స్పేస్ డిమాండ్: 17%
= గతేడాదితో పోలిస్తే తగ్గిన ఇండ్ల సేల్స్: 13%

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>