కలం, నిజామాబాద్ బ్యూరో: ఒకవైపు ‘ఎల్ నినో’ ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, అడుగంటుతున్న భూగర్భ జలాలు, ఎండుతున్న పంటలతో రైతన్నలు ఆందోళన చెందుతుంటే.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామం (Ankapur Village) మాత్రం పచ్చదనంతో కళకళలాడుతున్నది. వాతావరణం అనుకూలించకపోతే వ్యవసాయం దండగ అనే మాటను పూర్తిగా చెరిపేస్తున్నది.
కరువును చూసి భయపడకుండా, తమ ముందుచూపుతో ప్రకృతి వైపరీత్యాన్నే ఓడిస్తున్నది. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అందిపుచ్చుకుంటూ, వాణిజ్య పంటల సాగులో సరికొత్త ప్రయోగాలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. నీటి ఎద్దడి ఉన్న సమయంలోనూ సిరులు పండిస్తూ, నేటి తరం అన్నదాతలకు ఒక ‘సజీవ పాఠ్యపుస్తకం’లా నిలుస్తున్న ఆదర్శ గ్రామం అంకాపూర్ ప్రస్థానంపై ‘కలం’ సండే స్పెషల్..
నిజామాబాద్ జిల్లా వరి సాగుకు పెట్టింది పేరు. కానీ, నీటి ఎద్దడి ఉన్న సమయంలో అధిక నీరు అవసరమయ్యే వరిని సాగు చేయడం ఆత్మహత్యాసదృశ్యమని అంకాపూర్ రైతులు ఎప్పుడో గ్రహించారు. రైతుల ఆలోచనలకు ఆచరణ రూపమిస్తే వ్యవసాయంలో ఎంతటి విజయాన్ని సాధించవచ్చో నిరూపించారు. పూర్తిగా ఆరుతడి పంటల వైపు మళ్లారు.
తక్కువ నీటితో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పసుపు, మొక్కజొన్న, సజ్జ, జొన్న, వివిధ రకాల కూరగాయలతోపాటు విత్తనోత్పత్తికి అవసరమైన పంటలను సాగు చేస్తున్నారు. ఆధునిక సాగు పద్ధతులు, పంటల మార్పిడి, నీటి సమర్థ వినియోగంతో ఏడాదికి మూడు నుంచి నాలుగు పంటలు పండిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకున్నారు. మరోవైపు, ఏళ్ల క్రితం రైతులు వేసిన ఓ ఆలోచన నేడు వారి జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చింది. అదే పొలాల్లో నీటి కుండీలు.. ఫామ్ పాండ్స్.
100కు పైగా ఫామ్ పాండ్స్
ఒకటి, రెండు కాదు.. ఒక్క అంకాపూర్ గ్రామంలోనే 100కు పైగా సిమెంట్ నీటి కుండీలను రైతులు నిర్మించుకున్నారు. 2000 సంవత్సరం నుంచే ఈ విధానానికి శ్రీకారం చుట్టగా, కొందరు రైతులు 2010లోనూ వీటిని నిర్మించారు. అధికారికంగా 5,700 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో వలస వచ్చిన వారితో కలిపి జనాభా 10,500 వరకు ఉంటుంది. గ్రామ రెవెన్యూ పరిధిలో భూమి తక్కువగా ఉన్నప్పటికీ, రైతులు చుట్టుపక్కల గ్రామాల్లో భూములను కొనుగోలు చేసి సుమారు 2 వేల నుంచి 3 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి పలువురు ఎకరం నుంచి పది ఎకరాల విస్తీర్ణం వరకు నీటి కుండీలను నిర్మించుకున్నారు.
కరెంట్ తిప్పలు లేకుండా..
విద్యుత్ సరఫరా ఉన్న సమయంలో బోర్ల నుంచి నీటిని పంపింగ్ చేసి నీటి కుండీల్లో నింపుకుంటున్నారు. ట్యాంకు నిండిన తర్వాత సాగునీటి అవసరాల కోసం నిరంతరం విద్యుత్‌పై ఆధారపడకుండా.. పొలంలోని ఎత్తైన ప్రాంతంలో ట్యాంకును నిర్మించి, భూమి వాలును, పొలాల స్థాయికి అనుగుణంగా నీటిని ఉపయోగించుకుంటూ పంట పొలాలకు చేరేలా ఏర్పాట్లు చేశారు. దీంతో ట్యాంకులో నీరు నిల్వ ఉన్నంత వరకు కరెంట్‌తో సంబంధం లేకుండా అవసరమైనప్పుడు పంటలకు నీరు పారించుకునే వెసులుబాటు రైతులకు కలుగుతున్నది. అంకాపూర్ గ్రామం గుండా నిజాంసాగర్ కాలువ వెళ్తుండటంతో, కాలువ నీటిని కూడా రైతులు తమ నీటి కుండీల్లో నిల్వ చేసుకుంటున్నారు.
చుక్క నీటితో అద్భుతాలు
అంకాపూర్ పొలాల్లో సాధారణ కాలువల ద్వారా నీరు పారించడం ఎక్కడా కనిపించదు. ప్రతి ఎకరాలోనూ బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్), స్ప్రింక్లర్లు, మల్చింగ్ విధానాలను పక్కాగా అమలు చేస్తున్నారు. నీటి కుండీల్లో నిల్వ చేసిన నీటిని మోటార్ల ద్వారా డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థకు అనుసంధానించి, మొక్కల వేర్లకు నేరుగా అందిస్తున్నారు. దీంతో నీటి వృథాను తగ్గించి, 50 శాతానికి పైగా నీటిని ఆదా చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.
దీనివల్ల నేలలో తేమ ఆవిరి కాకుండా ఉండటమే కాకుండా, మొక్కకు అవసరమైనంత మేరకే నీరు అందుతున్నదని, ఫలితంగా, చుట్టుపక్కల గ్రామాల్లో బోర్లు ఎండిపోయి పంటలు వాడుతుంటే, అంకాపూర్‌లో మాత్రం పంటలు ఏపుగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. విత్తనోత్పత్తి, శుద్ధి రంగంలోనూ అంకాపూర్ ప్రత్యేకత చాటుతున్నది. ఒక్క గ్రామంలోనే 22 విత్తన శుద్ధి యూనిట్లు ఉండటం విశేషం.
ఐకమత్యమే మహాబలం
అంకాపూర్ (Ankapur Village) విజయానికి ప్రధాన కారణం గ్రామంలోని రైతు సంఘం, గ్రామ అభివృద్ధి కమిటీ. ఏ సీజన్లో ఏ పంట వేయాలి? మార్కెట్లో దేనికి డిమాండ్ ఉంది? విత్తనాలు, ఎరువుల కొనుగోలు ఎలా చేయాలి? అనే విషయాలను గ్రామ రైతులంతా కలిసి సమష్టిగా నిర్ణయించుకుంటారు. అంతేకాదు, గ్రామంలో ఉన్న 22కి పైగా విత్తన శుద్ధి కేంద్రాలు రైతుల పంటలకు స్థానికంగానే మంచి ధరను అందిస్తున్నాయి. అంకాపూర్ రైతుల నీటి సంరక్షణ, సమర్థ నీటి యాజమాన్య పద్ధతులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ కింద ఈ గ్రామాన్ని నీటి సంరక్షణ ఆదర్శ గ్రామంగా ఇప్పటికే ఎంపిక చేసింది. రైతుల స్వీయ ఆలోచన, సమిష్టి కృషి, ఆధునిక సాంకేతికత కలిస్తే వ్యవసాయ రంగంలో అద్భుతాలు సాధించవచ్చని అంకాపూర్ చాటిచెప్పిందని కేంద్రం కొనియాడింది.
నీటి ట్యాంకులది కీలక పాత్ర – కేకే బాజన్న, అంకాపూర్ (Ankapur Village)
మా అంకాపూర్ ప్రత్యేకతల్లో నీటి ట్యాంకులది ప్రధాన పాత్ర. సిమెంట్ నీటి ట్యాంకులు మా కరెంట్, నీటి కష్టాలను చాలా వరకు దూరం చేశాయి. ఇక్కడి రైతులు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తూ, ప్రయోగాలు చేపడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్నారు. అందులో భాగంగానే నీటి ట్యాంకులను నిర్మించుకున్నాం.
నీటి కొరత రాలేదు – నరేడ్ల గంగారం, అంకాపూర్
మా పొలంలో 12 ఏళ్ల కిందనే నీటి కుండీ నిర్మించుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీటి కొరత ఎదుర్కోలేదు. ఎల్ నినో వంటి పరిస్థితులు వచ్చినా మా నీటి ట్యాంకులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. పసుపు, జొన్న, మొక్కజొన్న, కూరగాయలు వంటి పంటలను సాగు చేస్తున్నాం. నీటి కుండీల ద్వారా డ్రిప్ పద్ధతిలో సాగు చేయడంతో తక్కువ నీటితోనే పంటలకు సరిపడా తేమ అందుతున్నది.
అప్పట్లో బోర్లలో నీళ్లొచ్చేవి కాదు – సల్ల భూమా రెడ్డి, అంకాపూర్
2000 సంవత్సరంలో మా పొలంలో నీటి ట్యాంకు నిర్మించుకున్నాను. అంతకుముందు కరెంట్ సమస్యలతో చాలా ఇబ్బందులు పడేవాళ్లం. రాత్రిళ్లు, తెల్లవారుజామున పొలాలకు వెళ్లి నీరు పెట్టాల్సి వచ్చేది. బోర్లలోనూ నీరు సరిగా వచ్చేది కాదు. అందుకే కరెంట్ ఉన్న సమయంలో నీటిని ట్యాంకులో నింపుకుని, అవసరమైనప్పుడు వినియోగించుకునే విధానాన్ని చేపట్టాం. అప్పటి నుంచి కరెంట్ ఎప్పుడు వచ్చినా, పోయినా, ఎల్ నినో వంటి పరిస్థితులు ఎదురైనా సాగునీటి విషయంలో ఇబ్బందులు తగ్గాయి.
Also Read : రియల్ ఎస్టేట్‌పై విమర్శలకు చెక్.. గ్రౌండ్ రియాలిటీ ఇదే!
Follow Us On : WhatsApp

