Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణకు నితిన్​ నబీన్​.. మూడు రోజుల పర్యటన!

క‌లం, వెబ్ డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్​ నబీన్ (Nitin Nabin)​ తెలంగాణలో పర్యటించనున్నట్లు తెలంగాణ‌ బీజేపీ చీఫ్ రామ‌చంద‌ర్ రావు (Ramchander Rao) వెల్లడించారు. జూన్ 28 నుండి జూన్ 30 వరకు మూడు రోజులపాటు ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారని చెప్పారు. జూన్​ 28న రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో నితిన్​ నబీన్ పాల్గొంటారన్నారు. అదే కార్యక్రమంలో మరో 9 జిల్లా బీజేపీ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అనంతరం నాంపల్లి గ్రౌండ్స్‌లో బీజేపీ బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొని ప్రసంగించనున్నారు. తరువాత నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని సందర్శించి, రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించనున్నారు.

జూన్ 29 న రెండో రోజు వీబీఐటీలో నిర్వహించే వికసిత్ భారత్ యువ సంవాద్ కార్యక్రమంలో ఆయన (Nitin Nabin) ప్రసంగించనున్నారు. అనంతరం వరంగల్‌కి వెళ్లి గిరిజన సంఘాల సమావేశంలో పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ బూత్ కార్యకర్తల సమావేశంలో కూడా పాల్గొంటారు. రాత్రికి తిరిగి హైదరాబాద్‌కి చేరుకుని అక్కడే బస చేస్తారు. జూన్ 30న ఘట్కేసర్​లో జరగనున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం ఆయన ఢిల్లీకి తిరిగి బయలుదేరుతారు.

మరోవైపు క‌ర్నాట‌క ప్ర‌భుత్వం తుంగ‌భ‌ద్ర ప్రాజెక్టుపై (Tungabhadra Project) ఏర్పాటు చేసిన నూత‌న గేట్ల‌పై తెలంగాణ‌ బీజేపీ చీఫ్ రామ‌చంద‌ర్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తుంగ‌భ‌ద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ఏర్పాటును స్వాగ‌తిస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు. ఆ గేట్ల పున‌రుద్ధ‌ర‌ణ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం కూడా ఉంద‌ని చెప్పారు. అయితే తుంగ‌భ‌ద్ర, ఆర్డీఎస్ ప్రాజెక్ట్‌ (RDS Project) విష‌యంలో తెలంగాణ ప్ర‌జ‌ల హ‌క్కుల‌ కోసమే బీజేపీ ప్ర‌శ్నిస్తోంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చినా కేంద్రం మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించి ఎన్నోసార్లు ప‌రిష్క‌రించింద‌ని గుర్తు చేశారు. ఇప్ప‌టికీ కేంద్రం రాష్ట్రాల మ‌ధ్య స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు సిద్ధంగా ఉంద‌ని తెలిపారు.

గ‌త ప్ర‌భుత్వం ప్రాజెక్టుల‌ను నిర్ల‌క్ష్యం చేసింద‌ని, ఈ ప్ర‌భుత్వ‌మైనా దీనిపై ఆలోచించాల‌ని సూచించారు. ప్రాజెక్టుల విష‌యంలో రాష్ట్రాల మ‌ధ్య ఉన్న స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్కార‌మ‌వ్వాల‌ని తాము ఆకాంక్షిస్తున్న‌ట్లు చెప్పారు. క‌ర్నాట‌క‌లో సీఆర్ పాటిల్‌తో జ‌రిగిన స‌మావేశంలో ఏయే అంశాల‌పై చ‌ర్చ జ‌రిగిందో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బ‌య‌ట పెట్టాల‌ని రామ‌చంద‌ర్ రావు డిమండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన వాటాలు వ‌స్తున్నాయా, ఈ రెండు ప్రాజెక్టులపై జ‌రిగిన చ‌ర్చ ఏమిట‌న్న‌ది తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన బాధ్య‌త సీఎం రేవంత్ రెడ్డిపై ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

Read Also: తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు నియామకం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>