కలం, స్పోర్ట్స్: వన్డే క్రికెట్ చరిత్రలో టీమిండియా (Team India Record) మరోసారి భారీ స్కోరుతో చరిత్ర సృష్టించింది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు వద్ద ఆలౌట్ అయింది. వన్డేల్లో భారత్ 400కు పైగా స్కోరు చేయడం ఇది 8వ సారి. దీనితో వన్డే క్రికెట్‌లో అత్యధిక సార్లు 400 ప్లస్ స్కోర్లు చేసిన సౌతాఫ్రికా (8 సార్లు) ప్రపంచ రికార్డును టీమిండియా సమం చేసింది.
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్భుత శతకాలతో ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. గిల్ (Shubman Gill) కేవలం 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 154 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు ఇషాన్ కిషన్ కేవలం 79 బంతుల్లోనే 14 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 125 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ ఇంతటి భారీ స్కోరు సాధించగలిగింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) త్వరగానే అవుట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసి జట్టుకు మంచి పునాది వేశాడు. ఆ తర్వాత గిల్, ఇషాన్ కిషన్ జోడీ ఆఫ్ఘన్ బౌలర్లను ముప్పతిప్పలు పెట్టారు. శ్రేయస్ అయ్యర్ 26 పరుగులు చేయగా, కెఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (19) రాణించడంతో భారత్ 402 పరుగుల మార్కును అందుకుంది.
ఆఫ్ఘన్ బౌలర్లలో నంగేయాలియా ఖరోటే అత్యుత్తమంగా రాణించి 10 ఓవర్లలో 76 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 8 ఓవర్లలో 48 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. గజన్‌ఫర్, మహమ్మద్ సలీమ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. భారత బ్యాటర్ల విధ్వంసంతో వన్డేల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా టీమిండియా (Team India Record) మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
Read Also: ఈశాన్య దిశలో నీటి చెంబు ఉంచితే ఏమవుతుంది? వాస్తు చెబుతున్న నిజాలు ఇవే
Follow Us On: X(Twitter)

