కలం, వెబ్ డెస్క్ : గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల వేళ ప్రధాని మోదీ ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన బహిరంగ సభలో దేశ ప్రజలు ఇంధనాన్ని పొదుపు చేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే ప్రధాని మోదీ పొదుపు మంత్రాన్ని పాటిస్తున్న వేళ తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court) కూడా ప్రధాని మోదీ పిలుపును స్వాగతించింది. ఈ మేరకు పొదుపు చర్యలు ప్రారంభించిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఇకపై ప్రతి సోమవారం, శుక్రవారం కేసుల విచారణలు భౌతికంగా కాకుండా కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయని సర్క్యులర్ విడుదల చేసింది.
అంతేకాదు కోర్టు పరిపాలనా విభాగమైన రిజిస్ట్రీలోని 50 శాతం సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు నిరంతరం టెలిఫోన్ ద్వారా అందుబాటులో ఉండాలని , అత్యవసర పరిస్థితుల్లో కార్యాలయానికి రావాలని ఆదేశిస్తే వెంటనే హాజరు కావడానికి సిద్ధంగా ఉండాలని సూచించింది. మరోవైపు ఇంధన సంక్షోభాన్ని అధిగమించేందుకు కారు పూలింగ్ విధానాన్ని అనుసరించాలని న్యాయవాదులకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే గమ్య స్థానానికి వెళ్లే ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకే కారులో కలిసి ప్రయాణించాలని తెలిపింది. ఇలా చేయడం వల్ల పెట్రోల్ ఖర్చులను ఆదా చేయడంతో పాటు, ట్రాఫిక్.. కాలుష్యాన్ని తగ్గించడానికి, సమయాన్ని ఆదా చేయడానికి దోహదపడుతుందని పేర్కొంది.

