కలం, వెబ్ డెస్క్ : నీట్ పరీక్షల నిర్వహణ, ముగింపు ప్రక్రియను ప్రతి ఏటా జాతీయ పరీక్షల సంస్థ (NTA) ద్వారా సంస్థాగతం చేసేందుకు ఒక యంత్రాంగాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక అఫిడవిట్‌ను దాఖలు చేయాలని సూచించింది. ప్రత్యేక నైపుణ్యం గల సిబ్బందిని, విస్తృత శ్రేణి నిపుణులను నియమించడం ద్వారా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో సంస్థాగత స్మృతిని, నైపుణ్యాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో ఆ అఫిడవిట్‌లో వివరించాలని జస్టిస్ పి.ఎస్. నరసింహ, అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
‘2024, 2026 నీట్ పరీక్షల వివాదాల వంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి అవసరమైన భౌతిక, మేథోపరమైన సామర్థ్యాలను NTA కలిగి ఉండేలా చూడటమే లక్ష్యంగా ఉండాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ అఫిడవిట్‌ను ఆరు వారాల్లోగా దాఖలు చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ రాధాకృష్ణన్ హై పవర్ కమిటీ, మానిటరింగ్ కమిటీ సిఫారసులు సమర్థవంతంగా అమలు అయ్యాయా? అని ప్రశ్నించింది. పర్యవేక్షణ ఉన్నప్పటికీ పేపర్ లీక్ జరిగిందంటే ప్రక్రియలో లోపాలు ఉన్నట్టేనని స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణకు సమర్థవంతమైన యంత్రాంగం ఉండాలని పేర్కొంది. నీట్ పేపర్ లీక్ తో విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది.
విచారణ సందర్భంగా, NTA, ఉన్నత స్థాయి కమిటీ ఛైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ దాఖలు చేసిన ప్రతిస్పందనలను (అఫిడవిట్లను) కోర్టు పరిశీలించింది. ముఖ్యంగా, కేంద్రం తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, దేశ ప్రధానమంత్రి స్వయంగా ఈ విషయాన్ని పర్యవేక్షిస్తున్నారని కోర్టుకు తెలియజేశారు.
Read Also: హమీర్‌పూర్‌లో విషాదం: వంతెన కూలి ఆరుగురి మృతి!
Follow Us On : WhatsApp

