Mobile Popup Ad
Mobile Popup Ad

రైతు డిస్కమ్ పేరుతో రేవంత్ సర్కార్ కుట్ర: కవిత

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో రైతు డిస్కమ్ పేరుతో రైతులపై రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) ఆరోపించారు. రైతు డిస్కమ్ ఏర్పాటుపై శుక్రవారం తెలంగాణ ఈఆర్సీ నిర్వహించిన ప్రజా అభిప్రాయ సేకరణ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రైతు డిస్కమ్ తో వ్యవసాయానికి ఎండ్రీన్ పోసినట్లు అవుతుందని.. రైతులకు అన్యాయం చేస్తూ 1999 నాటి కాల్పుల ఘటనను ప్రభుత్వం కొని తెచ్చుకోవద్దని సూచించారు. ఈ నిర్ణయం నిజంగా రైతులకు మంచి చేసేదే అయితే ఎందుకు సీక్రెట్ గా ఉంచారని ప్రశ్నించారు. డిస్కమ్ లకు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ద్రోహం చేసింది ప్రభుత్వమేనని విమర్శించారు. రాష్ట్ర రైతాంగం భవిష్యత్ ను ఆగం చేసే ఈ ప్రతిపాదనను ఈఆర్సీ రిజెక్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

రైతులను పచ్చిదగా చేస్తోన్న ప్రభుత్వం..

రైతు డిస్కమ్ (Rythu DISCOM) అనేది సంపూర్ణంగా తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయించే సబెక్ట్ అని.. కనుక రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రైతులు ఎంతో కష్టపడి 29 లక్షల బోర్లు వేసుకున్నారని.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక విద్యుత్ రంగంలో రూ. లక్ష కోట్లు పెట్టుబడి పెట్టి మంచి మార్పులు తెచ్చారని గుర్తుచేశారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి నుంచి ఒక్క ఎకరానికి నీళ్లు రాకపోయినా సరే బోర్ల ద్వారా నీళ్లు వచ్చాయని చెప్పారు. 20 లక్షల టన్నులు ధాన్యం పండించే తెలంగాణ రైతులు ఇప్పుడు కోటి 40 లక్షల టన్నుల ధాన్యం పండిస్తున్నారని అన్నారు. కానీ రైతు డిస్కమ్ కారణంగా మొత్తం 29 లక్షల బోర్ల మోటార్ల పరిస్థితి డోలాయమానంలో పడుతుందని చెప్పారు. రైతు డిస్కమ్ పేరుతో ఈ ప్రభుత్వం రైతులను పచ్చిదగా చేస్తోందని విమర్శించారు.

ధరణి, భూమాతతో ఏ మేలు జరుగలేదు..

ఇప్పటికే డిస్కమ్ ల పరిస్థితి బాగాలేదని ప్రభుత్వమే చెబుతోందని.. రైతులకు, లిఫ్ట్ ఇరిగేషన్ కు, ఫ్రీ కరెంట్ స్కీమ్ ఇచ్చే కరెంట్ కు ప్రభుత్వమే డబ్బులు ఇవ్వాలని చెప్పారు. ఇప్పటికే రూ. 25 వేల కోట్ల నష్టంలో డిస్కమ్ ను కంపెనీ పేరుతో రిజిస్టర్ చేస్తామంటున్నారని తెలిపారు. రెండున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం వైఖరి చూస్తున్న వాళ్లెవరు కూడా ఇది రైతులకు మంచి చేసే నిర్ణయమని నమ్మరని స్పష్టం చేశారు. గతంలో ధరణి, కాంగ్రెస్ వచ్చాక భూమాత పేరుతో రైతులకు ఏ మేలు చేయలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం కారణంగా తెలంగాణ రైతాంగం మొత్తం మోసపోయిందన్నారు.

మన 12 వందల మంది ఉద్యోగులకు కష్టం..

ముందు తెలంగాణలో పైలట్ ప్రాజెక్ట్ చేయాలని కోరుతున్నట్లు కవిత (Kavitha) తెలిపారు. ఎనర్జీ అడిట్ స్కీమ్ లు ఎప్పుడు కూడా సక్సెస్ కాలేదని.. ముందు పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటలు కరెంట్ వచ్చేందుకు కష్టపడింది తెలంగాణ విద్యుత్ ఉద్యోగులే.. కానీ మన 12 వందల మంది ఉద్యోగులకు కష్టం వచ్చిందని చెప్పారు. ఆంధ్రా నుంచి మన వద్దకు వచ్చిన 17 వందల మంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చారుని.. విభజన చట్టాలను పక్కన పెట్టి ఫోర్స్ ఫుల్ గా ఆంధ్రా ఉద్యోగులను తెలంగాణకు ఇచ్చారని అన్నారు. తెలంగాణ డిస్కమ్ లలో ఆంధ్రావాళ్ల పెత్తనం ఉండకూడదని వ్యాఖ్యానించారు. జెన్ కో, రెడ్ కో, సదరన్ డిస్కమ్ ఇలా అన్నింట్లో ఆంధ్రావాళ్ల పెత్తనమే ఉందని అన్నారు. హక్కు భుక్తంగా వచ్చిన వాళ్లు కాకుండా వేరే ఆంధ్రా ఉద్యోగులను లూప్ లైన్ పెట్టాలని డిమాండ్ చేశారు.

కచ్చితంగా తెలంగాణ వాళ్లే ఉండాలి..

రైతు డిస్కమ్ లో కచ్చితంగా తెలంగాణ వాళ్లే ఉండేలా చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. అదే విధంగా ఈ అంశంపై కచ్చితంగా అన్ని పార్టీలతో అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. డిస్కమ్ ల బకాయిల్లో మొదటి దోషి ప్రభుత్వమేనని.. డిస్కమ్ లు 69 వేల కోట్లు నష్టాల్లో ఉంటే 54 వేల కోట్లు ప్రభుత్వం నుంచే రావాల్సి ఉందని అన్నారు. కచ్చితంగా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. యూనిట్ 6 రూపాయలు పడే థర్మల్ పవర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఒక డిస్కమ్ ను ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఒక వేళ డిస్కమ్ కు లెసెన్స్ ఇస్తే.. ప్రతి రైతు వద్దకుతాము వెళ్లి ప్రభుత్వ మోసపూరిత నిర్ణయాలను వాళ్లకు వివరిస్తామని స్పష్టం చేశారు.

Read Also: ట్విషా శర్మ ఆత్మహత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>