కలం, వెబ్ డెస్క్: దేశంలో యాసిడ్ దాడుల కేసులపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బాధితులకు న్యాయం చేయడంలో కఠిన చర్యలు తప్పనిసరని స్పష్టం చేసింది. అవసరమైతే యాసిడ్ దాడి (Acid Attack) నిందితుల ఆస్తులను జప్తు చేసి, వాటిని వేలం వేసి బాధితులకు పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని సూచించింది. యాసిడ్ దాడులపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (షాహిన్ మాలిక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తదితరులు)పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా యాసిడ్ దాడులను అత్యంత అమానుష నేరాలుగా అభివర్ణించిన ధర్మాసనం, సాధారణ శిక్షలతో ఇటువంటి నేరాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదని అభిప్రాయపడింది.
పరిహారం చెల్లించలేకపోతే ఆస్తులు వేలం వేయాలి
యాసిడ్ దాడి నిందితుడు పరిహారం చెల్లించలేని పరిస్థితిలో ఉంటే, అతడి ఆస్తులన్నింటినీ జప్తు చేసి వేలం వేసి బాధితులకు ఇవ్వడంలో తప్పేముందని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. బాధితులకు పరిహారం అందడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఈ తరహా కేసుల్లో చట్టపరమైన సాధారణ చర్యలు సరిపోవని పేర్కొన్న ధర్మాసనం, నిందితులకు తీవ్రమైన బాధ కలిగించే శిక్షలు అవసరమని వ్యాఖ్యానించింది. “ఇలాంటి నేరాల్లో సంస్కరణ సిద్ధాంతానికి చోటు లేదు. నిందితుడికి గట్టిగా తాకే శిక్షలు విధించకపోతే ఈ దాడులు ఆగవు” అని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
యాసిడ్ దాడులపై రాష్ట్రాల నుంచి సమగ్ర వివరాలు
దేశవ్యాప్తంగా యాసిడ్ దాడుల పరిస్థితిపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలు జారీ చేసింది. సంవత్సరాల వారీగా నమోదైన యాసిడ్ దాడుల కేసులు, వాటిలో ఛార్జ్‌షీట్లు దాఖలయ్యాయా లేదా, ఎన్ని కేసులు తేలాయి, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే వివరాలను కోర్టు ముందు ఉంచాలని సూచించింది. అలాగే ప్రతి యాసిడ్ దాడి బాధితురాలి గురించి సమగ్ర సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. బాధితురాలి విద్యార్హతలు, ఉపాధి స్థితి, వివాహ స్థితి, వైద్య చికిత్స వివరాలు, ఇప్పటివరకు అయిన ఖర్చులు, భవిష్యత్‌లో అయ్యే వైద్య వ్యయాలు, పునరావాస పథకాలు అమలులో ఉన్నాయా లేదా అనే అంశాలపై పూర్తి నివేదిక సమర్పించాలని తెలిపింది. ఈ వివరాలను నాలుగు వారాల్లోగా సమర్పించాలని ఆదేశించింది.
కొత్త చట్టాలు అవసరమా?
యాసిడ్ దాడులు వరకట్న మరణాలంతే తీవ్రమైన నేరాలేనని పేర్కొన్న సుప్రీంకోర్టు, వీటిని మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కొత్త చట్టాలు లేదా చట్ట సవరణలు అవసరమా అనే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అదనపు సొలిసిటర్ జనరల్ అర్చనా పాఠక్ దవేను ఉద్దేశించి, “ఇది చిన్న నేరం కాదు. వరకట్న హత్యలకంటే ఏమాత్రం తక్కువ కాదు. చట్టపరమైన జోక్యం అవసరమా అనే అంశాన్ని ఆలోచించండి” అని సీజేఐ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా యాసిడ్ దాడి కేసుల విచారణల్లో జరుగుతున్న జాప్యాలపై కూడా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్‌లను పెండింగ్‌లో ఉన్న యాసిడ్ దాడి కేసుల వివరాలు సమర్పించాలని ఆదేశించిన విషయం గుర్తు చేసింది. బాధితులకు త్వరిత న్యాయం అందించేందుకు తక్షణ చర్యలు అవసరమని స్పష్టం చేసింది. యాసిడ్ దాడుల బాధితులకు న్యాయం, పునరావాసం, గౌరవప్రదమైన జీవితం కల్పించడమే లక్ష్యంగా ఈ సూచనలు చేశామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Read Also: నిర్మలమ్మ బడ్జెట్ హల్వా రెడీ.. ‘లాక్-ఇన్’ ప్రాంగణంలోకి సిబ్బంది
Follow Us On: Pinterest


