epaper
Thursday, January 29, 2026
spot_img
epaper

మహారాష్ట్ర కేబినెట్​లోకి సునేత్ర?

కలం, వెబ్​డెస్క్​: బారామతి వద్ద బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్​ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు గురువారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సహా అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు కొత్త అంశం తెరపైకి వచ్చింది. అదే.. మహా కేబినెట్​లో అజిత్​ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారు? అనే ప్రశ్న. ప్రస్తుతానికి సమాధానంగా సునేత్ర పవార్​ (Sunetra Pawar) పేరు వినిపిస్తోంది.

అజిత్​ పవార్​ భార్య అయిన సునేత్ర ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అజిత్​ సతీమణి కావడం, రాజకీయాల్లో అనుభవం ఉండడంతో ఆమెను కేబినెట్​లోకి తీసుకునేలా అధికార మహాయుతిని కోరాలని ఎన్​సీపీ భావిస్తోంది. అజిత్​​ స్థానంలో డిప్యూటీ సీఎంగా పదవి ఇవ్వాలని అడిగేందుకు సిద్ధమవుతోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇప్పటికే సునేత్ర పవార్ (Sunetra Pawar)​ తో ఎన్‌సీపీ సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, ధనంజయ ముండే, సునీల్ తట్కరే అంతర్గతంగా సమావేశమై చర్చించారు. అజిత్ దాదా మరణంతో ఖాళీ అయిన బారామతి నుంచి సునేత్ర బరిలోకి దిగడంతో పాటు, కేబినెట్​లో ఆయన నిర్వహించిన డిప్యూటీ సీఎం పదవిని అడగాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయంపై చర్చించేందుకు, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు ఎన్‌సీపీ నేతలు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలవనున్నారు.

శరద్​ పవార్​ అంగీకరిస్తారా?

ఎన్​సీపీకి ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేలే నాయకత్వం వహించే అవకాశం ఉంది. అయితే, ఎన్​సీపీ, ఎన్​సీపీ(ఎస్​పీ)ల విలీనం ఇప్పుడు అన్నింటికంటే ముఖ్యం. రెండేళ్ల కిందట బాబాయ్​ శరద్​ పవార్​(Sharad Pawar) తో విభేదించి.. ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తనవైపు తీసుకెళ్లి, పార్టీ పేరును, గుర్తును అజిత్​ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవలి మహారాష్ట్ర పుర ఎన్నికల సమయంలో బాబాయ్​తో అజిత్ పవార్​​ కలసిపోయారు. అంతేకాదు, ఎన్​సీపీ, ఎన్​సీపీ(ఎస్​పీ) కలసి కొన్ని పురపాలికల్లో పోటీ చేశాయి.

అప్పటి నుంచే రెండు పార్టీల విలీనంపై చర్చలు జరుగుతున్నాయి. అయితే, రెండూ కలిశాక మహాయుతిలో చేరేందుకు శరద్​ పవార్​ అంగీకరిస్తారా? అనేదే అసలు ప్రశ్న. ఎందుకంటే ప్రస్తుతం శరద్​ పవార్​ పార్టీ కాంగ్రెస్​ నేతృత్వంలోని మహా వికాస్​ ఆఘాడీ కూటమిలో ఉంది. విలీనం తర్వాత అధికార మహాయుతిలో కొనసాగుతారా? లేక ప్రతిపక్షంలోకి వెళతారా? అనేది పజిల్​గా మారింది. ఇది తేలితేనే సునేత్ర పవార్​కు మంత్రి పదవి ఖాయమవుతుందని భావిస్తున్నారు.

Read Also: నందినగర్ ఇంట్లో పోలీసులు.. భద్రత, విచారణ ఏర్పాట్లపై పరిశీలన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>