కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) అంశంలో బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్‌కు నోటీసులు జారీచేసిన సిట్ (SIT) పోలీసులు విచారణకు అవసరమైన సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. కేసీఆర్‌కు అనువైన ప్రదేశంలోనే విచారణ జరపడానికి పోలీసులు వెసులుబాటు ఇచ్చి నిర్దిష్ట స్థలాన్ని ముందుగానే తెలియజేయాలని స్పష్టం చేశారు. కేసీఆర్ నుంచి ఇంకా ఎలాంటి బహిరంగ ప్రకటన రాకముందే పోలీసులు మాత్రం నందినగర్‌లోని ఆయన నివాసాన్ని, పరిసరాలను పరిశీలించారు. ఎలాంటి ఏర్పాట్లు అవసరమో పోలీసు బృందం అంచనా వేస్తున్నది. పార్టీ శ్రేణులు విస్తృతంగా తరలి వస్తారనే ఉద్దేశంతో ఆ వీధి మొత్తాన్ని పోలీసులు కంట్రోల్‌లోకి తీసుకోనున్నారు. ఎక్కడెక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయాలో పరిశీలిస్తున్నారు. ఒకవైపు భద్రత, మరోవైపు విచారణకు అవసరమైన మౌలిక సౌకర్యాలపై పోలీస్ టీమ్ ఫోకస్ పెట్టింది.
ఎంక్వయిరీ లొకేషన్‌పై ఇంకా సందిగ్ధం :
నందినగర్ (Nandi Nagar) నివాసంలో ఎంక్వయిరీ జరిపితే చుట్టుపక్కల ఉంటున్న ప్రజలకు ఇబ్బందులు, అసౌకర్యాలు తప్పవనే అభిప్రాయంతో జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్‌కే వస్తానని కేసీఆర్ (KCR) చెప్పే అవకాశాలనూ పార్టీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. కేసీఆర్ నుంచి ఎలాంటి సమాచారం రాకముందే పోలీసులు నందినగర్ నివాసానికి వెళ్ళి పరిశీలన జరపడం అనేక సందేహాలకు తావిచ్చినట్లయింది. కేసీఆర్ నుంచి రిప్లై వచ్చిన తర్వాత పరిశీలన చేసి ఏర్పాట్లు చేయడానికి ముందే పోలీసులు పరిసరాలకు తగినట్లుగా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవచ్చో ప్లానింగ్ చేసుకున్నట్లు తెలిసింది. సాయంత్రం ఐదు గంటల సమయం వరకూ కేసీఆర్ విచారణకు హాజరుకావడం, ప్లేస్‌ను ఫైనల్ చేయడంపై స్పష్టత రాలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. పార్టీ శ్రేణుల్ని సైతం హైదరాబాద్ రావాల్సిందిగా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కేటీఆర్ (KTR) విచారణకు హాజరు కావడానికి ఒక రోజు ముందు ఇలాంటి సర్క్యులర్ జారీ అయినా ఇప్పుడు మాత్రం అలాంటి హడావిడి లేదు.
సన్నాహకాల్లో సిట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ :
మరోవైపు కేసీఆర్ విచారణ కోసం సిట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా రెడీ అవుతున్నది. కేసీఆర్‌ను ఏమేం ప్రశ్నలు అడగాలి?.. ఆయన నుంచి వివరాలను ఎలా రాబట్టాలి?.. ఆయన ఇచ్చిన సమాధానాల్లోంచి క్రాస్ ఎగ్జామినేషన్‌ను ఎలా చేయాలి?.. సమాధానాలు సరిగ్గా ఇవ్వకపోతే టెక్నికల్ ఎవిడెన్సులను ఆయన ముందు పెట్టి ఎలా నిలదీయాలి?.. ఇలాంటివాటిపై ఈ టీమ్ సమావేశమై చర్చించుకున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. ఇప్పటివరకు విచారణకు హాజరైన రిటైర్డ్ పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇచ్చిన వివరాలు, వాంగ్మూలాల్లో వెల్లడించిన అంశాల ఆధారంగా ప్రశ్నావళి రెడీ చేస్తున్నట్లు తెలిసింది. సిట్ టీమ్‌లో ఇప్పటికే పలువురు సీనియర్ అధికారులున్నారు. స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సీపీ విజయకుమార్, మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు సీపీ కేఎస్ రావ్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, ఏసీపీ శ్రీధర్, మెట్రో రైల్ డీసీపీ నాగేందర్‌రావు తదితరులంతా కేసీఆర్ విచారణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా యాక్టివ్ రోల్ పోషించనున్నారు.
Read Also: సారొస్తారా?.. అనారోగ్య కారణాలతో గైర్హాజరా?
Follow Us On : WhatsApp


